పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

రంగారాయ చరిత్రము


సీ.

నిశితాసిపాణులై నిలిచి శిఫాయీలు
       ప్రేమ ఱొ మ్మాని సలాము సేయ
నానమ్రమణిమకుటాంశుమాలికలతో
       సామంతనృపులు సాష్టాంగ మెరఁగఁ
గలధౌతమయకనద్ఘనవేత్రములవారు
       బలసి ముంగల బరాబరులు సేయ
వందిమాగధులు కైవారముల్ ప్రకటించి
       కొమరైన బిరుదుపద్యములు చదువ


తే.

మదవదైరావతముమాడ్కి మందమంద
గతుల నడతెంచి వచ్చి యుధ్ధతుల ముల్కు
గారి సందర్శన మొనర్చె గారవమున
కోచ యొక్కింత లేక యారాచపట్టి.

168


తే.

దర్శనానంతరంబునఁ దత్తదుచిత
బహుబహూకృతు లొదవె శుంభన్మదేభ
శోభమానాంశుకాదికలోభనీయ
రాజితోపాయనములు బరస్పరంబు.

169


ఉ.

అంత వసంతసంభ్రమసమంచితమైన మనంబుతో ధరా
కాంతుఁడు దంతపుంబని చొకాటపు నీటిమెఱుంగు గెంపురా
దొంతరవింతనంతనలతోఁ దగు పాలకి నెక్కి వచ్చి ని
శ్చింతమెయిన్ నివేశనము జేరె వడిన్ దివిటీల వెల్గునన్.

170


సీ.

గుబ్బెత లందిచ్చు గోదావరీనదీ
       స్వాదూదకంబుల జలక మాడి
శారదచంద్రచాంద్రీరోచిరుద్వాహ
       దములైన ధౌతవస్త్రములు గట్టి