పుట:2015.373190.Athma-Charitramu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 40

వులమీఁద నిపుడు సంపూర్ణ విజయము సంపాదింప సమకట్టితిని. నా యాత్మరామాయణమున నారణ్యకాండకథ సంపూర్తి కాఁగా, యుద్ధకాండవిధాన మంత నారంభమయ్యెను !

భూతకాల కార్యకారణపరిశీలనమున నొకప్పుడు మన కనులు చెదరిపోవుచుండును. మన దుర్గుణదురభ్యాసములను బరులసహవాసమున కారోపించువిషయమున మన మప్రమత్తత నూనవలెను. దుష్టులనియెడి యొక ప్రత్యేకస్థాయిసంఘ మెందును లేదు ! నేఁటి కోరికలు రేపు క్రియ లగుచున్నవి. నిజ దుస్సంకల్పములను కార్యగతము చేయఁగోరి, తదనుగుణ్యమగు సహవాసము చేసి, మన శీలమున కపు డాపాదించిన నైతికకళంకమును మనము సహచరులమీఁదఁ బడవేయుచుందుము ! ఇట్లు చేయుట న్యాయసత్యములకు దూర మైనను, మన యహంభావమున కమితశమనము గలిగించుచుండును. పరస్పరసఖ్యమున సంక్రమించు సుగుణదుర్గుణములకు నుభయ సహవాసులును సమానభాగస్వాములె. పరులచెలిమివలనఁ దమశీలసౌష్ఠవము చెడె నని మొఱలిడువారు, తమసావాసమున నితరుల కటులె చెడుగు సోఁకియుండు ననియును తమ దుశ్చింతలె పరులమనములందు దుష్టబీజములను వెదజల్లి నారు పెంచియుండవచ్చు ననియును జ్ఞప్తి నుంచుకొనవలెను. "మనబంగారము మంచిదైన కమసాలి యేమి చేయును ?" అను సామెత నీసందర్భమున మఱవఁగూడదు. పరుల దుస్సహవాసమున మనము చెడితి మనుకొనుటకంటె, మన దురుద్దేశములె తోడి దుశ్శీలురను తోడితెచ్చె ననుటలోనె సత్యసారస్యము లెక్కువగఁ గలవు. ఇట్లు తలపోయుట, మానసబోధ గలిగి ఆత్మపరిపాక మందుటకు సహకారముకూడ నగును. అట్లు తలంపకుండుట, నొప్పి యొకచోట నుండఁగా, వాఁత వేఱొకచోటఁ బెట్టిన ట్లగును !