పుట:2015.373190.Athma-Charitramu.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 616

17 వ అక్టోబరున నేను కూచిపూడిగ్రామమువెళ్లి, అచట నెలకొల్పఁబడిన "సేవాసమితి" సభ కగ్రాసనాధిపత్యము వహించితిని. నాతో శ్రీమాగంటి బాపినీడుగారుకూడ నుండిరి. మే మాదినముననే సాయంత్రము తెనాలిలో నొక బహిరంగసభలో నుపన్యసించితిని.

అక్టోబరు 30 వ తేదీని శ్రీ న్యాపతి సుబ్బారావుగారు రాజమంద్రిలో తమయింట నొక సభగావించిరి. నాకుఁ బిలుపురాఁగా నే నచటికేగితిని. హిందూ మతోద్ధరణము జరుపుటకు దేశములోఁ గొందఱు యువకులను మతప్రచారకులనుగ సిద్ధముచేయుటకై యొక యాశ్రమమును రాజమంద్రిలో స్థాపింప వలెనని పంతులుగారి యుద్దేశము. అందు గౌరవబోధకులుగను, వ్యవహారకర్తలుగను నుండుఁడని నన్నును, శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగారిని వారు కోరిరి. మేము సమ్మతించితిమి. ఈ యుద్యమ నిర్వహణమునకు పంతులుగారు తమతోఁట నిచ్చెదమనియు, వలసిన సొమ్మునకై తిరిగెదమనియుఁ జెప్పిరి. వారు 10 వేలకు తక్కువగాకుండ నిలువ ధనము నిచ్చినచో, త్వరలో నిట్టి సంస్థ యేర్పడఁ గలదని నేను జెప్పివేసితిని.

రాజమంద్రినుండి నేను భీమవరము నరసాపురములు వెళ్లి, తమ్ములను, తక్కిన వారలను జూచి, తిరిగి 7 వ నవంబరుకు గుంటూరు వచ్చితిని.

12-13 తేదీలలో జరిగిన "ఆఱవ ఆంధ్రరాష్ట్రీయ మహిళాసభకు" ప్రతినిధిగా నా భార్య రాజమంద్రి వెళ్లి, అక్కడనుండి తనపుట్టినిల్లగు వెలిచేరు పోయి, 18 వ తేదీకి గుంటూరు వచ్చెను. ఆమెతో మాలతియును, మా బావమఱఁది యిద్దఱు కోడండ్రును, గుంటూరు వచ్చిరి.