పుట:2015.373190.Athma-Charitramu.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47. ఉద్యోగప్రయత్నము 415

స్మృతికర్తలకు వితంతూద్వాహము లంగీకారమే కాని, పరాశరునికి మాత్ర మని యసమ్మత మని నుడివిరి. మఱియెవరును బ్రసంగింపకయె యధ్యక్షులు సభ విరమించి మా కాశాభంగ మొనరించిరి!

1901 సం. 9 వ సెప్టెంబరు వార్తాపత్రికలలో నెల్లూరు నందలి వెంకటగిరి రాజాగారి పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు కావలె ననుప్రకటనము గలదు. నేను దరఖాస్తు నంపితిని. నన్ను గుఱించి సిఫారసు చేయుఁడని యొకరిద్దఱు నెల్లూరుమిత్రులకు నేను వ్రాసినను, నా కీయుద్యోగ మగునని యాశలేదు.

మేము బెజవాడలో నివసించు బంగాళా నిశ్శబ్దమగు ప్రదేశ మందలి తోఁటలో నుండెను. చుట్టుపట్టులఁ జేరువ నిం డ్లేవియు లేవు. సమీపమున నుండునవి క్రైస్తవమహమ్మదీయుల గోరీలదొడ్లు మాత్రమే ! పాఠాశాలలోఁ బను లుండియు, బహిరంగసభలలోఁ బాల్గొనుచును, రాత్రులు నే నింటి కాలస్యముగ వచ్చునపు డెల్ల, ఒంటరిగ నింట నుండు నాభార్య దిగులుపడుచుండెడిది. 11 వ సెప్టెంబరున రాత్రి నే నాలస్యముగ నిలు సేరునప్పటికి నాభార్య విలపించు చుండెను. ఈ యిల్లు విడిచి యింకొక ప్రవేశమునకుఁ బోవుట యుక్త మని నా కంత తోఁచెను.

బాలికాపాఠశాలల పరీక్షాధికారి స్వామిరావుగారు 22 వ సెప్టెంబరున నా కగపడి, 'జనానాపత్రిక'లో మతవిషయక చర్చలు జరుగుచున్న వని పెద్దపరీక్షాధికారిణి కారుదొరసానిగారి యభిప్రాయ మని నాకుఁ జెప్పిరి. నే నేమిచేయను ? తెలుఁగుతెలియని యీ యధికారి ప్రముఖులు 'జనానాపత్రిక' ను గుఱించి వట్టి యపోహములు పడుచున్నారు ! కొలఁదిరోజులలో నే నాకాం