పుట:2015.373190.Athma-Charitramu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. పితృనిర్యాణము 337

ఇటీవల మాతల్లి తఱచుగ వ్యాధిపీడిత యగుచుండెడిది. మా తండ్రిమాత్రము సామాన్యముగ నారోగ్యభాగ్య మనుభవించుచునే యుండెడివాఁడు. కాని, 8 వ నవంబరున మాతండ్రికి జ్వరమువచ్చెనని తమ్ముఁడు వెంకటరామయ్య జాబువ్రాసెను. ఈరోజున వర్షము కురిసెను. నేను వ్యాకులచిత్తుఁడనైతిని. నాఁటిరాత్రి 9 గంటలకు రాజమంద్రిలోని మాతమ్మునియొద్దనుండి నాకు తంతివచ్చెను. మాతండ్రికి వ్యాధి యధికమయ్యెనని యం దుండెను. తమ్ముఁడు సూర్యనారాయణుని వెంటఁదీసికొని, నేనారాత్రి రైలులోనే బయలు దేఱితిని. దారి పొడుగునను మాజనకునిగుఱించిన దు:ఖకరమగు తలంపులు నామస్సును జీకాకుపఱిచెను.

మఱునాఁడు ప్రొద్దున మేము రాజమంద్రిచేరి, యింటికిఁ బోయి చూచునప్పటికి, మానాయన స్పృహతప్పి వేదనపడుచుండెను. అందఱమును విలపించితిమి. గతరాత్రి గడచుటయే దుర్లభమయ్యెనని మావాళ్లు చెప్పిరి. మాతండ్రి కేవిపత్తు సంభవించునో యని మేము భీతిల్లితిమి. భార్యను రమ్మని బెజవాడ తంతి నంపితిని. జాగ్రత్తతో మందులిచ్చుచు, మానాయనకు బరిచర్యలు చేసితిమి.

మాతండ్రికి సన్ని పాతము గానఁబడెను. దానికిఁదోడు, ఎక్కిళ్లుకూడ నారంభమయ్యెను. దేశీయవైద్యుఁడు కృష్ణమరాజుగారివలన లాభము లేదని యెంచి, రమణారావుగారి నేర్పఱిచితిమి. ఈవైద్యుల మార్పువలన రోగి కేమియు లాభము చేకూరదయ్యెను. 13 వ నవంబరు దీపావళినాఁడు మానాయనకు వ్యాధి ప్రబలమయ్యెను. నాడి క్షీణించెను. జ్వరము తగ్గినను, రోగి బొత్తిగ విశ్రాంతి లేక బాధపడు చుండెను.