పుట:2015.373190.Athma-Charitramu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 178

ఇపుడు నా దేహమునిండ చెమ్మటలు పట్టెను. నిదానముగల యావైద్యుఁడు నాచేయి చూచి, నాడిలో దోషము లేకుండుట గ్రహించెను. జ్వరము విడుచుటచేత ముచ్చెమటలు పట్టి నాకు నిస్సత్తువ గలిగె నని నిశ్చయించి, నా కాయన, పేలాలజావ పోయించెను. నేను తెప్పిఱిల్లితిని. ఆవైద్యునియౌషధమువలన నొకవారమునకు నాకు నింపాందించెను.

41. వైరివర్గము

మహమ్మదీయ సంపాదకునిచే నడుపఁబడుచుండెడి "సత్యాన్వేషిణీ" పత్రిక, హిందూసంఘ దురాచార నిరసనము నెఱపుచుండెడి మా "సత్యసంవర్థని" యెడ సానుభూతి చూపు నని లోకు లనుకొనవచ్చును కాని, అట్లు జరుగలేదు. జనన మొందినది మొదలు, "సత్యాన్వేషిణి" ప్రార్థన సామాజికులను, "సత్యసంవర్థని"ని దూషించుటతోనే కాలము గడపెను. ఈదూషణ మైనను, సిద్ధాంతములలోను విధానములందును గల యభిప్రాయభేదము లాధారముగఁ జేసికొనిన ధారాళవిమర్శన మైనచోఁ గొంత సారస్యముగ నుండెడిది. అట్లు గాక, "సత్యాన్వేషిణి" వ్యక్తిగత దూషణములు చేయఁ జొచ్చెను. ప్రార్థన సామాజికులకు లేనిపోని యవగుణము లారోపించి, వారి యాదర్శములను వెక్కిఱింపఁ జొచ్చెను. మా సమాజమువా రెంత యోపికతో నూరకుండినను, సత్యాన్వేషిణి నోరు కట్టువడలేదు. అంతట వీరేశలింగముపంతులు, మహమ్మదీయసంపాదకునిచేతను, బ్రాహ్మణకార్యనిర్వాహకునిచేతను బ్రకటింపఁబడెడి యాపత్రికకుఁ దగుసమాధాన మీయఁదొడంగెను. సెప్టంబరు "సత్యసంవర్థని" లో "సాభిప్రాయవిషయ వ్యాసము" వ్రాసినది వీరె. దీనిలో