పుట:2015.373190.Athma-Charitramu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 176

నా వైద్యమిత్రుఁ డిచ్చు నిద్రాకరమగు మందె నాకు వికారము గలిగించి నిదురను బాఱఁద్రోలుచుండును ! నిద్ర యెట్లు పట్టునా యని యాలోచించినకొలఁది నా కది దూరస్థ మగుచుండును !

రాత్రి నిద్దురమాట యెటు లుండినను, పగటికాల మేమాత్రమును వేథచేయక నేను చదువుచుందును. ఏమాత్రము చదువుపా లెక్కువయైనను, ఒక్కొకసారి బొత్తిగఁ జదువుకున్నను, నాకురోగము ప్రత్యక్ష మగుచుండును. బంగారము తూఁచుత్రాసువలె, మిగుల చిన్నమార్పుననైనను నాదేహము రోగముదెస కొఱగుచుండును. అయినను, వ్యాధినుండి యొకింత తెఱపి గలిగినేని, నేను మరలఁ జదువుచు పత్రికకు వ్రాయుచు, కాలమును సద్వినియోగము చేయ నుంకించుచుందును. ఈసంగతి, ఆనాఁటి నాదినచర్యపుస్తకములలోని క్రిందియుల్లేఖమువలన తేటఁబడఁగలదు: -

"బుధ. 13 జూలై 1892 : నాకు బాధ హెచ్చెను. తయారు చేసిన వ్యాసమును అచ్చున కిచ్చితిని. వేదన అతిశయంచెను. ఊపిరి సరిగా విడువనేరక నేను పండుకొనియుండుట చూచి, కనకరాజు కంట తడిపెట్టుకొనెను. నాయఁడుగారిమందు వలన కొంత యుపశమనము గలిగెను. బంధుమిత్రులు నన్నుఁ జూడవచ్చిరి. భగవానుఁడా, యెటులయినను నేను నీవాఁడనెకదా !"

"సోమ. 18 జూలై :- ప్రొద్దుననే నా పూర్వశత్రువు గుండె నొప్పి మరల పొడసూపెను. రోజంతయు బాధనొందినను కళాశాలకుఁ బోయితిని. గదిలోనివస్తువులు సరదుకొంటిని. అచ్చుచిత్తులు దిద్దితిని. లోకాక గూడ నుండెను."