పుట:2015.373190.Athma-Charitramu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 90

గతసంవత్సరము వఱకును హిందూక్రైస్తవబ్రాహ్మమతాదులనుగుఱించి నాకుఁ దెలియనే తెలియదు. ఇపు డట్లు కాదు. నీతి మతసంఘ సంస్కరణములనుగూర్చి నా కిపుడు కొంత తెలిసియున్నది.

నే నొకఁడ నన నేల? నా మిత్రబృందమును మంచిప్రబోధము గలిగియుండిరి. గతసంవత్సరమున చివరభాగమున, పరిస్థితుల ప్రభావమున నా మస్సున భక్తిబీజములు పడి, సంస్కరణావేశ మను మొలక లెత్తినవి. నా సావాసు లందఱు మంచి యభివృద్ధిఁ గాంచిరి. నా చెలికాండ్రందఱికిని నా కభిమతమగు సంస్కరణోద్యమము హృద్య మగుట కడు చోద్యము ! ఈమార్పు రాజమంద్రిలోని సదావరణప్రభావమున ప్రభవించినను, మఱియేకారణమున నుద్భవించినను, ఇపుడు నాసుహృదు లందఱును సంస్కారప్రియులై యుండి రనుట స్పష్టము !

ఇంక చెంకటరావునుగుఱించి : అతఁడు మంచివాఁ డనియె నానమ్మిక. కాని, దుశ్శీలుఁ డని యపవాదము లాసమయమున ప్రబలియుండెను. దీనినిగుఱించి నేను బ్రశ్నింపఁగా, నాకువలెనే తనకును వితంతువివాహసంస్కరణ మామోద మగుటచేత, ఎన్ని కడగండ్లకో యోర్చుచుండెడి యొకబాలవితంతువుదెస తాను సానుభూతి గనఁబఱిచిన తప్పిదమున తాను నిందలపా లైతి నని చెప్పి నా మిత్రుఁడు కన్నీరు తెచ్చుకొనియెను ! మానవహృదయావలోకనము చేయఁగల పరమాత్మునకె యిందలిసత్య మవగాహన కాగల దని నమ్మి, నా మనస్సును సమాధానపఱుచుకొంటిని.

ఇది జరిగిన కొన్ని దినములకుఁ గలసికొనినపుడు, మే మిరువురము నా భావజీవితమునుగుఱించి తలపోసితిమి. పరమజ్యోతిష్కుని