పుట:2015.329863.Vallabaipatel.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

వల్లభాయిపటేల్

మని యది చేసిన ప్రయత్నములకంటె దాని పేరుప్రతిష్ఠలను భంగించునది మఱొకటిలేదు.

"హైదరాబాదులోఁ బాకిస్థాన్‌కు స్వప్రయోజనము లేవియు లేనప్పటికి నా రోజులలో హైద్రాబాద్ ప్రధానిగాఁ బనిచేసిన మీర్ లాయక్ ఆలీ నిజమునకుఁ బాకిస్థాన్ ప్రతినిధి. ఇతర సంస్థానములకంటె హైదరాబాద్‌పట్ల మనము చాల నుదారముగాఁ బ్రవర్తించితిమి. హైదరాబాద్‌కు బెక్కువిధముల ననుకూలమైన యధారీతి యొడంబడికకు మనము సమ్మతించితిమి. కాని యిదే తరుణములోఁ బాకిస్థాను కఱువదికోట్ల రూపాయలను ఋణమిచ్చుటకు హైదరాబాద్ ప్రభుత్వము రాయబారము చేసినది.

"అయినప్పటికిఁ దన యభీష్టానుసారము నిజాం సమస్యను బరిష్కరించుటకు లార్డు మౌంట్ బాటెన్ కవకాశమిచ్చితిమి. చివరివఱకు నాయన యాశతోనే యున్నాఁడు. హైదరాబాదుకు స్వయముగా వెళ్ళి యొడంబడికపై నిజాముచేత సంతకము చేయించవలెననికూడ నాయన తలపోసినాఁడు. కాని యాయన యాశలు ఫలించలేదు. విఫలమనోరథుఁడై విచారముతో నాయన వెళ్ళిపోయినాఁడు.

"లార్డు మౌంట్ బాటెన్ నిష్క్రమణపిమ్మట మనకుఁదోఁచినవిధముగ మనము నిజాముసమస్యను బరిష్కరించుకోవలసి వచ్చినది. హైదరాబాదుకుఁ బాకిస్థాన్ పెక్కు విధములఁ దోడ్పడుచున్నదని మనకుఁ దెలియును.