పుట:2015.329863.Vallabaipatel.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

14

వల్లభాయిపటేల్

భార్యావియోగము - స్థితప్రజ్ఞత్వము

పటేలు గోధ్రాలో నున్నప్పు డా పట్టణమునఁ బ్లేగు వ్యాధి యతిభయంకరముగాఁ బ్రబలినది. ఆ కోర్టు నాజరు కుమారునకుఁగూడ నా వ్యాధి సోకెను. ఆ కుఱ్ఱవానికి వల్లభాయి చాల సపర్యలుచేసెను. కాని యతని మరణము తప్ప లేదు. వల్లభాయికిఁగూడ జబ్బుచేసినది. ఆ జబ్బుస్థితిలోనే యాయన బండిమీద నానందపట్నమునకు వచ్చెను. వచ్చి భార్యతో కరంసాద్ గ్రామమునకుఁ బొమ్మనిచెప్పి తాను నడియాడ్‌కుబోయెను. ఆయనభార్యకు జబ్బుగానున్న భర్తకు సేవ చేయువలయునని యుండెను. కాని పటేలుమాటకుమాఱాడ లేక యామె యూరకుండెను. ఇంతకు విధి వేఱువిధముగా నున్నది. వల్లభాయి నడియాడ్ చేరఁగనే యారోగ్యము నొందెను. కులాసాగానున్న యాయన భార్య కరంసాద్ చేరఁగనే మంచము పట్టెను. వల్లభాయి యామెను బొంబాయి పంపి యాపరేషను జేయించెను. ఆస్పత్రినుండి భార్య యారోగ్యమును గూర్చి యాయన కనుదినము వార్తలు వచ్చుచునే యుండెను. ఆమె యారోగ్యము నానాటికిఁ జెడి తుదకుఁ బ్రాణాపాయమే కలిగెను. ఆయన కోర్టులో వాదించుచుండగా (1908) భార్య చనిపోయినదని టెలిగ్రాము వచ్చినది. పటేలు వాదమధ్యమున నుండెను. టెలిగ్రాము చదువుకొని యీషణ్మాత్రమైనఁ జలించక తన వాదమును బూర్తిచేసెను. తరువాత మిత్రులు టెలిగ్రాముసంగతి నడుగగా వారి కీ సమాచరముఁ దెలియఁ జేసెను.