Jump to content

పుట:1857 ముస్లింలు.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ప్రస్తుతం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న చారిత్రక సందార్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం నూటయాభై సంవత్సరాల సంబరాలను ప్రకటించింది. 2007 మే 11 నుండి 2008 మే 11 వరకు ఈ సంబరాలను నిర్వహించేందుకు మూడు వందల కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ ప్రకటన మేరకు వివిధ రాష్ట్రాలు కూడాసంబరాల నిర్వహణకు పూనుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడ 2007 ఆగష్టు నుండి 2008 ఆగష్టు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహణకు నడుంకట్టింది.

ఈ మేరకు ఇటు దేశ వ్యాప్తంగానూ అటు పలు రాష్ట్రాలలోనూ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.ఈ సంస్మరణ కార్యక్రమాలలో ఇతర ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యోధుల సరసన ముస్లిం యోధులకు తగిన స్థానం గానీ, ప్రాధాన్యత గానీ దక్కడం లేదు. ప్రముఖ యోధుల పేర్లను నామమాత్రంగా కూడా స్మరించకుండా ప్రభుత్వాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయా నేతల చిత్రపటాలు కూడాలేకుండా సభలు సమావేశాలు సాగుతున్నాయి. బ్రిటిష్‌ సైన్యాల పాలిట అరివీర భయంకరులుగా ఖ్యాతిగాంచి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో వీరవిహారం చేసిన యోధానుయోధుల ప్రస్తావనలు లేకుండా ప్రముఖుల ప్రసంగాలు జరుగుతున్నాయి.

ప్రజా సంఘాలు, ప్రజలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నముస్లిం యోధుల గురించి తెలియాల్సినంతగా వారికి తెలియకపోవటంతో తమకు తెలిసిన యోధుల మేరకు మళ్ళీ మళ్ళీ కార్యకలాపాలు జరుపుకుంటూ, వారిని గుర్తు చేసుకుంటూ గౌరవించుకుంటున్నారు.

ఈ పరిస్థితిని గమనిస్తే 1957 నాటి విస్మరణ రమారమి 2007లో కూడా పునరావృతం అయిందన్పిస్తుంది. ఈ విస్మరణను ప్రశ్నించిన వారు లేరు. ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా మేధావులకు కలగడం లేదు. స్వాతంత్య్ర సంగ్రామ యోధులు మతాలకు కులాలకు అతీతంగా పోరుబాట సాగించారు కనుక మతం పేరిట వారిని విడదీసి కార్యక్రమాలు జరపటం ఉచితం కాదని కొంతమంది వాదిస్తూ ముస్లిం యోధులను స్మరించటమే మర్చిపోతున్నారు ! దురదృష్టవశాత్తు ఈ రకమైన మానసిక వాతావరణం బాగా తయారైఉంది. ఈ వాతావరణం ఏర్పాటుకు గత చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్రను సక్రమంగా అవగాహన చేసుకుంటే గాని ఈ విస్మరణ మానసిక స్థితికి కారణం సరిగా అవగతం కాదు.

248