పుట:హాస్యవల్లరి.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వి - వెధవమాటలూ వీళ్ళూ, మరీ నిమ్మళంగా మాట్లాడుతున్నారోయ్! గొంతుకలు పూడాయ్ పీనుగులికి, గొల్లచల్ల దాహం పుచ్చుగున్నట్టు!

240

పంచదార నీళ్ళల్లో కరుగుతుందని పిల్లలదగ్గర్నించి రాబట్టి, కరగడాన్ని గురించి పాఠం చెప్పదల్చుగువచ్చిన రామన్న మేష్టరు,

రా - నీళ్ళల్లో పంచదార వేస్తే ఏమవుతుంది? రొండోవాడు!

రొం - పానకం అవుతుందండి!

రా - (చికాకుపడి) అల్లానా! నువ్వు ఎవరబ్బాయివి?

రొం - మావాళ్ళ అబ్బాయినేనండి.

రా - (కొంచెం కోపంతో) ఎవరు మీవాళ్ళూ?

రొ - మా అమ్మా, మానాన్నా, మాబామ్మా, మాచెల్లాయీవాళ్ళూనండి.

రా - (ఇంకా కోపంతో వెళ్ళి పిల్లాణ్ణి ఒకలెంపకాయ కొట్టి) అబ్బా!

రొం - ఎందుకూ నన్ను కొట్టడం? మళ్ళీ యింకోటికొడితే దవడపళ్ళు ఊడిపోను. ఈపాటికి!

241

వేదాంతం చదువుకున్న ఒక మేష్టరు గణితం బోధిస్తూ ఒక లెక్క కొంతవరకే పదిలంగాచేసి, తుద నెగ్గడం విషయం అపనమ్మకంతోచి, బోర్డుమీద తను రాసినంతమట్టుకు చేత్తో చూపించి పిల్లలతో,

మే - ఇల్లానే కొంతదూరం చేసుగుపొండి. ఆన్సరు ఎదురుగుండా చక్కావస్తుంది. కర్మకాండ అంతాయింతే!

ఒక పిల్లాడు - అవునుగానండీ, సరియైన ఆన్సరు రావాలంటే, జ్ఞానకాండ వేరుగా ఉండవలసి వచ్చేటట్టు తోస్తుందండి!

మే - అవును నీ జ్ఞానకాండలా ఉండకూడదు.

ఒ - ఏమండీ?

మే - యోగం !

242

బంగారు - ఎమోయ్! ఏంజెప్పినా, ఉఁ ఆఁ అనవాయిరీ, ఉసూరుమని ఉంటూంటావ్! ఏమిటీ?

శేషు - ఏముటో! ఏమిలేదూ?

బం - నవ్వనేనా నవ్వవేం?

శే - సరేగాని, ఒరేయి, నువ్వు “విట్టు” వేద్దాం అనుకున్నప్పుడు కాస్తంత ముందుగా నాతో చెబుతూండేం!

బం - ఎందుకూ? ఎక్కించుగుంటావా?

శే - కాదు, నవ్వుతుండాలి, అలవాటుగా!

బం - అదిటోయ్! నేనేమీ అనుకోనులే!

శే - నేనెరగనుట్రా! కాని, రేపు మరొకరవుతుంది. నా అలవాటుకోసం నే చెప్పింది!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

54

హాస్యవల్లరి