పుట:హరివంశము.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - సప్తమాశ్వాసము

     వత్సాంకవిభూతిని
     భావన పావనచరిత్ర భాసురభువన
     పావనగుణౌఘ సుస్థిర
     జీవన వేమజననాథ జితజనాథా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు వాసుదేవుచరితంబుపరి
     పాటి యంతయు నంతఃకరణంబున నభినందించి యభిమన్యునందనుండు వైశంపా
     యనున కి ట్లనియె.2
క. మునివంశవర్య యేవ్విధ, మునఁ బశుపతిగుప్తగరిమఁ బొదలెడిదనుజేం
     ద్రునిఁ బరిభవించె విష్ణుఁడు, వినవలతుఁ దదీయవృత్తవిస్మయవిధముల్.3
వ. అని యడిగిన నతం డి ట్లనియె.4
సీ. మానుషమూర్తియై మధుసూదనుఁడు చరియించుకాలంబున నేపు మిగిలి
     బాణుఁడు దొడఁగినపనియును నచ్యుతుఁ డనలాక్షగుహసహాయత్వదీప్తు
     నాతని భంగించి ప్రాణమాత్రావశిష్టునిఁ జేసి పోవనిచ్చినవిధంబు
     సురేశ్వరునకు నుమాధినాథుఁడు దొల్లి యొసఁగినపుత్రత్వయుక్తికల్మి
తే. కతనఁ గ్రమ్మఱుఁ గలిగినగణపతిత్వ, మాది యగుశుభములు గడునద్భుతంబు
     లింతయును గ్రమమున మనుజేంద్ర నీకు, విస్తరింతుఁ బ్రశస్తవాగ్విరచనముల.5
చ. విను బలిపట్టి బాణుఁ డతివిశ్రుతబాహుసహస్రుఁ డిద్ధయౌ
     వనదశ నెల్లచోఁ దిరుగువాఁ డొకనాఁడు మనోజ్ఞదివ్యఖే
     లనములఁ దల్లిదండ్రు లుపలాలన సేయఁగ నొప్పుషణ్ముఖుం
     గనియెఁ గుబేరశైలమణికాంచనసుందరకందరస్థలిన్.6
వ. ఇట్లు గనుంగొని.7
క. ఆముఖము లాభుజావలి, యామేనివికాసరేఖ యభినవములుగా
     శ్రీ మెఱయుకుమారుని తే, జోమహిమకు నద్భుతంపుఁజొక్కుఁ దలిర్పన్.8
ఉ. ఏమితపంబు సేసి పరమేశున కీతఁడు పుత్రుఁడై దృఢ
     ప్రేమనిబద్ధుఁ జేసెఁ గడుఁ బేరగు నట్టితపంబు చేసి యు
     ద్దామవిభూతి నింతటిపదంబు భజించెద నేను సంశయం
     బేమిటి కన్తలంపు దనుజేంద్రునకుం జనియించె నత్తఱిన్.9
వ. అయ్యుదాత్తనిశ్చయంబువలన వికల్పవిరహితుం డై కడంగి.10