పుట:హరివంశము.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

హరివంశము

వ. అయ్యవసరంబునఁ [1]గాల్యకరణీయంబులు నిర్వర్తించి యక్రూరుం డటమున్న
     కృతకర్తవ్యుం డై యున్నగోపాలమధ్యశోభితుం బద్మనాభునిం గాన నరుగు
     దెంచి.172
మ. శ్రుతిసీమంతపదంబులం బ్రకటమై సుస్నిగ్ధసిందూరసాం
     ద్రత రంజిల్లెడు వాసుదేవుచరణద్వంద్వంబు గోష్ఠస్థలీ
     గతుల న్నూతనగోమయంబుల ననర్ఘశ్రీఁ దలిర్చె న్మహా
     ద్భుత మీయొప్పిద మంచు భక్తివినయస్ఫూర్జత్సమస్తాంగుఁడై.173

అక్రూరుండు శ్రీకృష్ణబలరాముల మధురకుఁ దోడ్కొని పోవుట

వ. ఇదె రథం బాయితం బై యున్నయది యగ్రజపూర్వకంబుగా నారోహణం
     బొనర్పు మనిన నతం డట్ల చేయం దాను సారథ్యంబు వహించి వ్రజంబు నిర్గమించి
     మధురామార్గంబు గైకొనియె నంత.174
క. రేయిటనుండియుఁ గృష్ణునిఁ, బాయుటకుం దలరు గోపభామినులు నిజం
     బై యప్పుడు హరివిరహ, వ్యాయతదుఃఖంబు దమ్ము నట పొదువుటయున్.175
వ. కళవళించు డెందంబులతో నందఱు దరతరంబు లై కూడి గోవిందుపిఱుందం దగిలి
     తమలోన.176
శా. అక్రూరుం డను పేరు పెట్టుకొని క్రూరాత్ముం డొకం డద్భుత
     ప్రక్రాంతిం జనుదెంచి పద్మనయనుం బాపెం గటా యెంతయున్
     వక్రంబై కడుఁగీడు సేయుటకు దైవం బిచ్చమైఁ బూనినన్
     శక్రుం డైనను శక్తుఁడే యుడుపఁ దత్సంరంభ మేభంగులన్.177
మ. కులమున్ శీలము మానమున్ మొదలుగాఁ గొన్నాఁడు మున్మున్న య
     గ్గలికం బ్రాణములుం గొనంగఁ గడఁగెం గా కేమి యీకృష్ణుఁ డీ
     వల నీతం డిటువోవఁగా నిజధనుర్వ్యాపారముల్ సూప కా
     వలరాజింతట సైపఁజాలునె మమున్ వామప్రతాపోగ్రతన్.178
తే. ఏటిసంసార మని మన మితనివెనుకఁ, దెగువసేసి పోయితిమేనిఁ దిట్ల కాక
     యడవిపులి మానుసుల నేల యాదరించు, నగరకాంతలవలలందుఁ దగిలి యతఁడు.179
క. [2]కొన్నియనాళులు గోమై, వెన్నుం డి ట్లేల మనకు వేడుకచెయ్వుల్
     కొన్ని గఱపె దైవమ యిం, కెన్నం డీపెన్నిధాన మిట సిద్ధించున్.180
సీ. అదె యిదె లోలనేత్రాంశులు పర్వంగ నధికాదరస్నిగ్ధుఁ డగుచుఁ జూచె
     నదె యిదె నెమ్మొగం బలరుమించులు ముంప నాకూతకౌతుకి యగుచు నవ్వె
     నదె యిదె చారుదంతావళి జిగి యొప్ప నాపూర్ణశృంగారుఁ డగుచుఁ బలికె
     నదె యిదె భావంబు లనుభావముల నూన నభిమతార్థప్రీతుఁ డగుచు మెచ్చె

  1. నాల
  2. కొన్నిటి నాళులు