పుట:హరివంశము.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

హరివంశము

సీ. మీతండ్రి వసుదేవుఁ డాతతయశుఁ డిట్టి సుతుల నిద్దఱఁ గన్నసుకృతశాలి
     యనిశంబు గంసభయంబున డెందంబు తటతట నదరంగఁ గుటిలుఁడైన
     యవ్విపక్షునిచేత నవమానవాక్యచయంబులం బడిపడి యాసమాలి
     కన్నప్డ [1]కొడుకులఁ గానపా ల్పఱిచి తా శోకంబు బ్రాణసంశోషకముగ
తే. నున్నవాఁ డమ్మహాత్ముని నుద్ధరింపఁ, దగదె యిఁక నెన్నఁటికి నీయుదారశక్తి
     చూచెదవు గాదె యావృద్ధు నీచనృపతి, సేవ నెబ్భంగిఁ గాఱియఁ జివికినాఁడొ.151
క. కొలువున నొక్కొకమఱి యా, ఖలుఁడు భవజ్జనకుఁ బలుకఁగానిపలుకులం
     బలుకఁగ విని యే మెల్లం, దలలు వనట వ్రాల్తు మశ్రుధారలు దొరుఁగన్.152
క. వసుదేవుపాటుకొలఁదియె, యసదృశచారిత్ర యైనయాదేవకి పు
     ణ్యసతీతిలకము మీత, ల్లి సతతముం బొక్కుతెఱఁగు లెక్కింప మదిన్.153
సీ. దుఃఖాతిభరమునఁ దొమ్మిదినెల లుదరంబున భరియించి క్రమముతోడఁ
     గానంగఁ గానంగ గర్భము ల్దోడ్తోన కంసుఁ డొక్కింతయుఁ గరుణ లేక
     తునిమెడుదురవస్థ కనయంబు నోర్వంగ నమ్మనస్వినియ కా కన్యసతులు
     గలరె యక్కట పుత్రు లెలమితోఁ, గుడిచినచన్నులె యాతల్లిచన్ను లనఘ
తే. యెఱుఁగునే పూర్ణచంద్రుని నెనయునట్టి, నీదు నెమ్మోము [2]ముద్దియ నిక్కమునకు
     గుఱుతుగలదె యాయమ్మకుఁ గొడుక వీవు, నెఱపవలవదె పుత్రత్వనియతఫలము.154
క. విలయార్ణవమగ్న యయిన, యిల నాదివరాహమూర్తి నెత్తవె యాప
     జ్జలనిధి మునిఁగిసజననిం, దొలఁగఁగ వెడలించువెరవు దొరకొల్పు మెదన్.155
చ. ఉడుగక కన్నునీరఁ గడు నొప్పఱి చాయలు చెడ్డకన్నులున్
     వెడఁగురుపడ్డమోముఁ బటువేదనఁ గుందినయంతరంగమున్
     బడుగయి యున్న మేను నయి భామిని వత్సవిహీనధేనువుం
     దడపఱుపంగవచ్చుఁ దనదైన్యము శూన్యతయుం గనుంగొనన్.156
క. నీయట్టికొడుకుఁ బడసియు, నాయమ్మ దురంతదుఃఖ యగునేని సుత
     శ్రీ యింతులకు నిరర్థక, మాయతవంధ్యతయ లెస్స యనఁగాఁ దగదే.157
తే. అకట సర్వలోకంబుల కభయ మిచ్చి, కావఁ జాలినవాఁడవు కన్నతల్లి
     దండ్రు లిట్లార్తిఁ దలరంగఁ దలఁప కునికి, మెచ్చుగాదు నావాక్యంబు లిచ్చగింపు.158
సీ. కాలాభుఁ గాళియుఁ గడతోఁకపట్టి యేవెరవున వ్రేసితి విషము గ్రక్క
     దుర్ధరతమము గోవర్ధనం బెత్తి యేకడిమిమైఁ దాల్చితి గొడుగు గాఁగ
     దుష్టచరిత్రు [3]నరిష్టుని ముట్టి యేయనువునఁ ద్రొక్కితి వసువు లెడల
     దారుణబలుఁ గేశిదానవుఁ గిట్టి యేయేపున వ్రచ్చితి రూపఱంగ
తే. నాదిఁ బూతనాశకటఘాతాదులందుఁ, దెలివి దలకొంటి వట్టి యగ్గలిక నేఁడు
     నాత్మఁ బాటింపు మహిత[4]శోకాభితప్తు, లైనగురులు నిశ్శోకత నందుపనికి.159

  1. బిడ్డలఁ
  2. ముద్దీయ
  3. డరిష్టుఁడన్ యసుర నే
  4. వంశాభి