పుట:హంసవింశతి.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 125

కోణాంగులు సేవపరులు పరసలు పడిగెవారు పరంగు లింగిలీసులు పరాసులు వళందులు సన్న్యాసు లేకదండత్రిదండు లేకాంగులు వానప్రస్థులు యోగు లవధూతలు పరమహంసిలు బైరాగులు జటాధారులు దిగంబరులు గోముఖులు నియమస్థు లూర్ద్వబాహులును, గోరడజోగులు కాటిపాపలు మందపిచ్చులు పిచ్చుగుంట్లు చర్మకర్ములు చండాల మాతంగులు తలక్రిందుజోగులు రామగోవిందులు మొదలగువారును, బురోభాగంబున నేల యీనిన చందంబున, వెల్లివిరిసిన చాడ్పున, నుసుళ్ల విధంబున, మిడుత గమిలాగున, బేడిసెకదుపు భంగిని, నాకుఁ జిలుకల మొత్తంబు వంతున, బెరయీఁగల పగిదిని, స్వాతిబకంబుల వీఁకను, గంగాతరంగంబుల కైవడి, జలబుద్బుదంబుల వైఖరి, వర్షధారల పోల్కిని, రామరావణ బాణపరంపరల రీతినిఁ, బుంఖానుపుంఖంబులుఁ దండోపతండంబులు లక్షోపలక్షలు శాఖోపశాఖలుఁ గోటానుకోటులు సంఖ్యాతిసంఖ్యలుగా నడుచు సమయంబున. 29

క. నెఱిఁగంట మాళ్లిడుదు ని
ద్దఱు మంచి కొమాళ్లు గలుగ దయచేసిన నో
పెరుమాళ్ళని యా వాచా
లి రుమాళ్ల నొసంగి మ్రొక్కి యేఁగుచునుండన్. 30

క. ఆయెడ వరదత్తుండను
కాయజరేఖాసమానకలితాకారుం
డా యింతి యున్న చక్కటిఁ
బాయక నిలుచుండి దానిపై మోహమునన్. 31

ఉ. కందువమాటలాడి వగకారితనంబులు సూపి సన్న లిం
పొందఁగ సల్పి చేరికల నుల్లము రంజిలఁజేసి తమ్ములం
బందఁగనిచ్చి మెచ్చి భుజమందుఁ కరంబిడి నవ్వుచేష్టఁ గే
ళిం దమిరేఁచి గుబ్బలు ఛళీమని నల్చి రతైకచిత్తుఁడై. 32