పుట:హంసవింశతి.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 హంస వింశతి



తే. అనుచు రాయంచ నుడివిన విని శిరంబుఁ
ద్రిప్పి హేమావతి ప్రమోద మొప్పఁ బలికె
నౌనె! మజ్ఝారె! యదిగాక యాఁడువారి
తెలివి యనుచును జిఱునవ్వు దలకొనంగ. 67

క. తెలవాఱె నపుడు దీపపుఁ
గళికలతో వెల్లఁ బాఱఁగాఁ దనమోమున్
భళిర! కథాలాపంబని
జలజేక్షణ చనియెఁ గేళిసదనంబునకున్. 68

చ. చని జలజాప్తుఁ డస్తగిరి చాటున కేఁగినయంత మజ్జనం
బొనరించి వ్రాఁతనుంబనులనొప్పు దుకూలముఁ గట్టి రత్నకాం
చకమయ భూషణంలును సారపు మేల్తిలకం బమర్చి ఘ
మ్మను విరు లూని యచ్చెలి నృపాగ్రణి చెంగటి కేఁగు చున్నెడన్. 69

మ. కని చక్రాంగబిడౌజుఁ డిట్లనియె, శృంగారంబు లెస్సాయె మే
ల్దనరారెన్ భళి! హొంతకారివి గదే తన్వంగి! రాజాంతికం
బునకుం బోయెదవేమొ! యొక్క కథ యొప్పున్, దచ్చమత్కారముల్
వినిపో! నిల్పి ననంటిపండ్లనె ననున్ వ్రేయించుమంతన్ వెసన్. 70

క. అన విని హేమావతి మో
మున నవ్వు జనింపఁ గతల మునిపుట్ట సుమీ!
కన నీదు కడుపు బ్రహ్మకు
వినఁ దరమా! యనుచుఁ బలికి వినిపింపుమనన్. 71

క. కప్పురపుఁ దునుక లలవడ
విప్పుగ విరితేనెవాన విడివడి కురియం
జొప్పడర హంససురపతి
చెప్పెను హేమావతీ కుశేశయముఖికిన్. 72