Jump to content

పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ధాత్రిలో క్షత్రియుల్ దలఁపఁగ నన్యాయ
                   గతుల వర్తింపంగఁ గడు నసూయ
ద్విజుఁడవై వేదశదిక్కులనసహాయ
                   శూరుఁడ వనుచు సంస్తుతులు మ్రోయ
గండ్రగొడ్డలియనుకైదువ కెఱసేయ
                   నిరువదియొకమారు నరులమాయ
చెండాడి సర్వభూమండల మామ్నాయ
                   విదుల కిచ్చి దయటి వేల్పురాయ


తే.

రాజరాజనిధన్యేయ రైణికేయ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

76


సీ.

హరి! నీవు మనుజుఁడ వౌ టెంతయాశ్చర్య
                   మెదిరి తాటక నేయు టెంతధైర్య
మవనిజాపరిణయోత్సవ మెంతయాశ్చర్య
                   మెచ్చి భార్గవు గెల్చు టెంతశౌర్య
మటవీగుహలు జేరు టది యెంతయాశ్చర్య
                   మెలమి వారధి గట్టు టెంతవీక్య
మఖిలాసురధ్వంస మది యెంతహత్సర్య
                   మిల నిజశ్రీ గాంచు టెంతశౌర్య


తే.

మౌర! శ్రీరామచంద్రాఖ్యవీరవర
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

77


సీ.

యాదవవంశనిధూదయేందుఁడ వౌచు
                   వెన్నెలకన్నమై వన్నదేల
కప్పుపచ్చడము మై గట్టుక యిరుగేల
                   ముసలహలంబులు బూని లీల
ముష్టికాదినిశాటముఖ్యుల నిల గూర్చి
                   పెకలించి కరిపురస్థలి సమూల
మెత్తిన నీబలం బింతింత యనజాల
                   తెలిసినకొలఁది గీర్తింతుఁ జాల


తే.

కరము కన్పట్ట వ్రేమోలఁ గాలపాల
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

78