పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అఖిలధర్మస్థాపనాచార్యుఁడౌ యుధి
                   ష్టిరుఁడు వైవస్వతపురము గాంచె
గోకోటిదానముల్ ప్రాకటంబుగఁ జేసి
                   యూసరవెల్లియై పుట్టె నృగుఁడు
క్రతుశతావబృథంబు గన్న యానహుషుండు
                   పెనుచిల్వయై బిలంబున జనించె
ఘనతపోనియతిచే ననఘుఁడైన యయాతి
                   సద్గతిఁ బాసి భూస్థలికి నొరిగె


తే.

వేషమున దాసుఁడను మహాదోషినయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

70


సీ.

తిమితిమింగలము లాదిగ చెంతలకు జేర
                   నంతయు గొందులయందు దూర
బాతాళఫణులు నవ్వల నివ్వలను బార
                   జలరాసులన్నియు గలకబార
సోమకాసుర మహాచోరునిగ పోర
                   బ్రాణముల్ బాప కోపంబు దీర
బ్రహ్మతారకమంత్రపఠనసన్నిధి జేర
                   శ్రుతు లొసంగితి మహోన్నతులు మీర


తే.

వీరాధివీర మత్స్యావతార
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

71


సీ.

పాలసంద్రము పెద్దపాలగూననున్న
                   తరి భంగమయ్యె గోత్రములమిన్న
దానికి ఫణిరాజు త్రాడు గావలనగొన్న
                   సొరిది ద్రచ్చిరి సురాసురులు మున్న
జిగి దప్పి నీటిలో సగము గ్రుంకుచు నున్న
                   వేడ్క నెత్తితివి నీవేల్పు లెన్న
పొలుపొంద నంతట బుట్టె మేలగు వెన్న
                   వేల్పుల కిచ్నితి వెన్న వెన్న


తే.

సిరిని జేకొన్న దామేటిదొరవు రన్న
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

72