పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తనువు నమ్మెద బుద్బుదప్రాయముగఁ బుట్టి
                   లొల్లి గిట్టినవారితోవ లెరిగి
కలిమి నమ్మెద చలచ్చలసంపదల నిక్కి
                   పిదపఁ జిక్కినవారిబెఁడద యేఱిగి
ప్రాయ మెన్నెద మదాక్రాంతవైఖరి లొంగి
                   ముదిసి యీల్గెడివారివిధ మెఱింగి
పరుల నమ్మెద దేహబంధుత్వముల నంటి
                   తుదివృథ జనువారిదూ రెఱింగి


తే.

తెలివి లేదాయెఁ గప్పె నీదివ్యమాయ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

64


సీ.

వసుదేవదేవకీవరగర్భరత్నాక
                   రామృతమూర్తి భక్తానువర్తి
నారదవ్యాసశౌనగపరాశరదివ్య
                   తాపసధ్యేయ సద్మాసహాయ
జగదేకనిర్మాణసంత్రాణసంహార
                   త్రిగుణప్రధాన పన్నగశయన
ఘనవరరత్నకాంచనదివ్యభూషణ
                   శృంగారదేహ విహంగవాహ


తే.

భువనమోహనవేష సంపూర్ణతోష
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

65


సీ.

సర్వలక్షణములఁ జక్కనినిరుమేను
                   హృద్పుటంబున లిఖియింపుమయ్య
బ్రభుజనానుగ్రహపాత్రుని గావించి
                   యెంచి లోకముల మెప్పించుమయ్య
తాపత్రయంబునఁ దపియింపకుండ నీ
                   వే నను నరసి రక్షింపుమయ్య
నేర్చినేర్వనిపను ల్పేర్చి నేరము గూర్ప
                   కోర్చి సద్గతి నన్నుఁ జేర్చుమయ్య


తే.

ఏమి సేయుదువో మీద టెఱుఁగనయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

66