పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఆశాపిశాచంబు నదలింపనేర్తునే
                   తగినమీరక్షకత్వంబు లేక
కామాదివైరుల గదుపంగనేర్తునే
                   నిలనీయ నుగ్రహబలిమి లేక
సంసారదుఃఖంబు సడలింపనేర్తునే
                   తథ్యంబు నీప్రసాదంబు లేక
యజ్ఞానపంకంబు నడగింపనేర్తునే
                   పొసగిన మీదయారసము లేక


తే.

యన్నిటికి మీరె ప్రాపకు లయ్య మాకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

55


సీ.

ఒకమారు మీనామ ముచ్చరించినఁ జాలు
                   ఖలుఁ డజామీళుసంగతిని విన్న
శరణాగతుండైనఁ జాలు హంతవ్యుని
                   కాకాసురుని గాచు గాథ విన్న
విశ్వసించినఁ జాలు వెలయ విభీషణు
                   రాజ్యాభిషేకధర్మంబు విన్న
నిముషమాత్రమే జాలు నిను బ్రసన్నునిఁ జేయ
                   ఖట్వాంగుమోక్షణజధను విన్న


తే.

మనసు దృఢమైన నీకృపఁ గనుట యెంత
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

56


సీ.

భర్మగోపురమంటపాస్థానములు గలుగు
                   వేంకటేశ్వరుఁ డిలవేల్పు మాకు
నిజనాభియందు మాణిక్యంబు గల్గిన
                   వరదరా జిష్టదేవతయె మాకు
సప్తసాలావృతసద్విమానారూఢ
                   రంగేశుఁ డఖిలభారకుఁడు మాకు
శ్రీకరభధ్రాద్రిశిఖరనిత్యావాస
                   రామచంద్రుం డేలురాజు మాకు


తే.

కలవు మహదాశ్రయము లట్ల తలతు నిన్ను
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

57