పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

శ్రీ సీతారామాంజనేయసంవాదము


పరాగ= రేణువు యొక్క, అంశ = అల్పభాగమును, (స్వల్ప మగుపాదధూళిని) భజన = సేవించుటయందు, తత్సరుఁడన్ = ఆసక్తి గలవాఁడను. (ఆమహాదేవాచార్యుని శిష్యుఁడను అనుట.) పరశు....జుఁడన్ = పరశురామపంతుల కులమందుఁ బుట్టిన (ఈకవియింటి పేరు పరశురామపంతులవారు) రామమంత్రిమౌళి = మంత్రులలో నుత్తముఁడగు రామయ్య అనువానికిని, తిమ్మాంబికా = తిమ్మాంబ యనునామెకును, ప్రియాత్మజుఁడన్ = ప్రియపుత్త్రుఁడను, (ఈకవి పేరు లింగమూర్తి, గురుమూర్తి) అయిన నేను,

తా. కోనేరుగురుశిష్యుఁ డగునామహాదేవాచార్యునకు శిష్యుఁడనై పరశురామపంతుల రామయ్యకును దిమ్మాంబికకును పుత్త్రుఁడ నై యున్న నేను. (ఈ పద్యము షష్ఠ్యంతములతోను వాని కావలనుండు వచనములోను జేర్చి యేకవాక్యముగా నన్వయించుకొనవలయును.)

క. శ్రీరామనామమంత్రా, కారునకు ససంగ నిర్వికారునకు మహా
    కారునకు నిర్జితాహం, కారున కజ్ఞానభూమికాదూరునకున్. 34

టీక. శ్రీరా... నకున్ - శ్రీరామ = రాముని యొక్క, నామ = పేరు గలిగినట్టియు, మంత్ర = తారకమంత్రమే, ఆకారునకున్ = స్వరూపముగాఁ గలిగినట్టియు, (రామ దేవతా స్వరూపుఁడైనట్టియు, తారకమంత్రరూపుఁ డైనట్టియు) అ... నకున్ అసంగ = ప్రపంచ వికారములతో సంబంధము లేనట్టియు, నిర్వికారునకున్ = షడ్వికారములు లేనట్టియు, (అస్తి = కలఁడు, జాయతే = పుట్టుచున్నాఁడు, వర్ధతే = వృద్ధిఁ జెందుచున్నాఁడు, విపరిణమతే = మార్పునొందుచున్నాఁడు, అపక్షీయతే = క్షీణించుచున్నాడు. నశ్యతి = నాశనమును జెందుచున్నాఁడు అని చెప్పుటకు వీలైనస్థితులు ఆఱును వికారము లనఁబడును.) మహాకారునకున్ = సర్వవ్యాపక మైన (లేక విరాట్పురుషరూపమైన) ఆకారము గలిగినట్టియు, (ఇచ్చట మహోంకారునకు అని పాఠాంతరము గలదు. అప్పుడు " పూజనీయమైన ఓంకారమే స్వరూపముగాఁ గలవాఁడు " అని యర్థము). ని... నకున్ - నిర్జిత = జయింపఁబడిన, అహంకారునకున్ = అహంకారము గలిగినట్టియు, అ ...నకున్ - అజ్ఞానభూమికా = ఏడువిధము లగు అజ్ఞానభూమికలకు, దూరునకున్ = దూరమైనట్టియు (అజ్ఞాన భూమికలు లేనట్టియు.)

తా. శ్రీరామస్వరూపుఁడును, తారకమంత్రమే యాకారముగఁ గలవాడును, ప్రపంచముతోఁ గాని, యందలివికారముతోఁ గాని సంబంధము లేనివాఁడును, గర్భస్థుఁడగుట పుట్టుట వృద్ధిఁజెందుట మార్పునొందుట (లేక, ముసలితనము నొందుట) క్షీణించుట చచ్చుట యనియెడు నాఱువికారములు లేనివాఁడును, విరాట్పురుషరూపుఁడును, అహంకారమును జయించినవాఁడును, అజ్ఞానభూమికలయందుఁ జిక్కుఁబడనివాఁడును.