పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 101

మనుజవిభునిఁ గాంచి వనరాశి చెప్పిన
వినయభాషణంబు లెనయఁజెప్పి. 175

క. నాలుగురత్నాకరముల
మూలద్రవ్యములబీజములొ[1] యనఁదగు నా
నాలుగురత్నంబులు నా
నాలుగుమహిమలును జెప్పి నరపతి కిచ్చెన్. 176

వ. ఇచ్చిన నమూల్యంబు లగువానిం జూచి యిందొకటి నీ వేఱుకొమ్మ నిన నతండు నాయింట నాలిం గొడుకుం గోడలిని విచారించి వచ్చి పుచ్చుకొనియెద నని సంభ్రమంబునం జని మువ్వురం బిలిచి యారత్నంబు లిట్టిట్టి సంపద లిచ్చు వీనిలో నేది పుచ్చుకొంద మని తలపోయుచున్నపుడు. 177

సీ. సైన్యంబు గలిగిన జగమెల్లఁ జేపడుఁ
గొను డిది యౌ నని కొడుకు పలికె
ధర “ధనమూల మిదం జగ” త్తనుమాట
తగు నిది గొన నని తండ్రి పలికె
నిష్టాన్నములు మదిఁ దుష్టిగాఁ గుడుతుము
మే లిది గొను మని యాలు చెప్పె
భూషణాంబరములభోగంబు లిది గొంట
వెర వని కోడలు విన్నవించె
ఆ. నిట్లు వేఱువేఱు నిచ్చలఁ దమలోన
జగడ మైన నతఁడు మగిడి వచ్చి
యింటివారికలహ మెఱిఁగించి వీనిలో
నీవ యొకటి యిమ్ము దేవ యనుడు. 178

  1. మూలధనములయినవి నిజముల