పుట:సత్యశోధన.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

47

చూచే అలవాటు వుండేది. కాని ఇక్కడ నిలువెత్తు అద్దం ముందు నిలబడి టై సరిచేసుకోవడం మొదలుగాగల పనులకు ప్రతిరోజూ పది పదిహేను నిమిషాలు వ్యర్ధం అవుతూ ఉండేవి. నా జుట్టు మృదువుగా వుండేది కాదు. అందువల్ల దాన్ని సరిగా దువ్వుకోవడానికి బ్రష్‌తో నిత్యము కుస్తీ పట్టాల్సి వచ్చేది. హేటు ధరించినప్పుడు, తొలగించినప్పుడూ పాపిట చెడిపోకుండా చెయ్యి దానిమీదనే వుంటూ వుండేది. అంతేగాక సభ్యుల మధ్య కూర్చున్నప్పుడు ఎప్పుడూ చెయ్యి పాపిట మీదనే వుంటూ వుండేది.

ఈ టిప్పుటాపులు అంతటితో ఆగలేదు. ఆంగ్లేయుల వేషం వేసుకున్నంత మాత్రాన సభ్యుడవటం సాధ్యమా? ఇంకా సభ్య లక్షణాలు నేర్చుకోవలసినవి చాలా వున్నాయి. డాన్సు చేయడం నేర్చుకోవాలి. ఫ్రెంచి భాష బాగా నేర్చుకోవాలి. ఇంగ్లాండుకు పొరుగున వున్న ఫ్రాన్సు దేశపు భాష ఫ్రెంచి. యూరప్ పర్యటించాలనే కోరిక నాకు ఉండేది. అంతేగాక సభ్య పురుషుడు ధారాళంగా ఉపన్యసించడం కూడా నేర్చుకోవాలి. నేను డాన్సు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక క్లాసులో చేరాను. ఒక టరముకు మూడు పౌండ్లు ఫీజుగా చెల్లించాను. మూడు వారాలలో ఆరు తరగతులు జరిగి వుంటాయి. తాళానికి అనుగుణ్యంగా అడుగుపడలేదు. పియానో మోగుతూ ఉండేది. కానీ అదిఏమి చెబుతున్నదో బోధపడేది కాదు. ఒకటి, రెండు, మూడు అంటూ వాయిద్యం ప్రారంభమయ్యేది. కాని వాటి మధ్య గల అంతరాళం అర్థం అయ్యేది కాదు. ఇక ఏం చేయాలి? చివరికి నా వ్యవహారం కౌపీన సంరక్షణార్థం అయంపటాటోపః అన్న చందానికి దిగింది. వెనకటికి ఒక సన్యాసి తన గోచీని కొరకకుండ ఎలుకల్ని ఆపడానికి ఒక పిల్లిని పెంచాడట. పిల్లిని పెంచడానికి ఒక ఆవు. ఆవును కాచేందుకు ఒక కాపరి, ఈ విధంగా గోచీని రక్షించుకోవడం కోసం సంసారం ఏర్పడిందట.

పాశ్చాత్య సంగీతం నేర్చుకునేందుకై ఫిడేలు నేర్చుకోవాలని నిర్ణయించాను. ఫిడేలుకు మూడు పౌండ్ల సొమ్ము ఖర్చయింది. ఫిడేల్ నేర్చుకోడానికి కొంత ఖర్చు పెట్టక తప్పలేదు. ఉపన్యాస ధోరణి నేర్చుకొనేందుకు మరో గురువుకు ఒక గిన్నీ ప్రవేశ రుసుం క్రింద చెల్లించాను. అందుకోసం బెల్ రచించిన స్టాండర్డ్ ఎలోక్యూషనిస్ట్ అను గ్రంథం కొన్నాను. అందలి ఫిట్‌గారి ఉపన్యాసంతో అభ్యాసం ప్రారంభించాను.

కాని ఆ బెల్ అను ఆయన నా చెవిలో (బెల్ అనగా) గంట వాయించడంతో మేల్కొన్నాను.