పుట:సత్యశోధన.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

429

భవిష్యత్తును గురించి యోచిస్తాడా? భూతకాలంలో చేయబడ్డ నిర్ణయాలను అమలు బరిచి నడుస్తున్న సంవత్సరంలో పూర్తిచేయగలుగుతాడా? అందువల్ల అందరి దృష్టి యీ విషయం మీద కేంద్రీకృతం అయింది. వేలాదిమంది ప్రతినిధులుగా గల సభ మీద ఆధారపడి దేశానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా సాగుతాయి? ప్రతినిధుల సంఖ్యకు హద్దు అంటూ ఏమీలేదు. ప్రతి ప్రాంతాన్నుండి ఎంత మందైనా సరే ప్రతినిధులు రావచ్చు. ఎవరైనా సరే ప్రతినిధులు కావచ్చు. ఇందు కొంత మార్పు అవసరమని అంతా నిర్ణయానికి వచ్చాము. యిక నియమావళిని తయారుచేసే బాధ్యత నేను వహించాను. అయితే ఒక షరతు పెట్టాను. ప్రజల మీద యిద్దరు నాయకుల పట్టు నేను గమనించాను. అందువల్ల వారి ప్రతినిధులు నాతోబాటు వుండాలని కోరాను. వాళ్లు హాయిగా కూర్చొని నియమావళి తయారుచేయలేరని నాకు తెలుసు. అందువల్ల లోకమాన్యునికి, దేశబంధువుకి విశ్వాసపాత్రులగు ఇద్దరు ప్రతినిధుల పేర్లు ఇమ్మని వారిని కోరారు. వారు తప్ప నియమావళి కమిటీలో మరెవ్వరూ వుండకూడదని చెప్పాను. అందుకు అంతా అంగీకరించారు. లోకమాన్యులు శ్రీ కేల్కారు గారి పేరు, దేశబంధు శ్రీ ఐ.బి. సేన్ గారి పేరు సూచించారు. యీ కమిటీ సమావేశం ఒక్కరోజున కూడా జరగలేదు. అయినా మేము మా పని ఏకగ్రీవంగా పూర్తిచేశాం. ఇట్టి నియమావళి తయారు చేయగలిగామనే అభిమానం మాకు కలిగింది. ఈ విధానం ప్రకారం సంస్థను నడిపితే సంస్థ యొక్క పని సవ్యంగా సాగుతుందని నా విశ్వాసం. అయితే నేను యీ బాధ్యత వహించి నిజంగా కాంగ్రెస్ సంస్థలో ప్రవేశించినట్లయిందని అభిప్రాయపడ్డాను. 

39. ఖాదీ పుట్టుక

1908 వరకు నేను రాట్నాన్నిగాని, మగ్గాన్ని గాని చూచినట్లు జ్ఞాపకం లేదు. కాని రాట్నం ద్వారా హిందూదేశపు ఏ దారిద్ర్యాన్ని పారత్రోలవచ్చో ఆ ఉపాయంతోనే స్వరాజ్యం కూడా పొందవచ్చునను విషయం అందరూ గ్రహించారు. 1901లో దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశం వచ్చాను. అప్పటికి నేను రాట్నం చూడలేదు. ఆశ్రమం తెరవగానే మగ్గం ఏర్పాటు చేశాం. మగ్గం వల్ల యిబ్బంది కలిగింది. మాకు దాన్ని గురించి ఏమీ తెలియదు. మగ్గం తెప్పించినంత మాత్రాన పని అవుతుందా? మేమంతా కలం వీరులం లేక బేరసారాలు చేసేవాళ్ళం. అలాంటి వాళ్ళం అక్కడ చేరాం. నేతపనివాడు ఒక్కడు లేడు. అందువల్ల మగ్గం తీసుకురాగానే నేత నేర్పడానికి