పుట:సత్యశోధన.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

350

కుంభయాత్ర

శాంతినికేతనంలో చూచాను. పాకీపని చేయడం మనదేశంలో ఒక వృత్తిగా మారిపోతున్నది. మా వాలంటీర్ల కోసం ఏదో సత్రం ఆవరణలో డేరాలు వేశారు. మలమూత్ర విసర్జన కోసం డాక్టర్ దేవ్ కొన్ని గుంటలు త్రవ్వించారు. అయితే ఆ గుంటల పారిశుద్ధ్యం విషయంలో డాక్టర్ దేవ్ జీతాలు తీసుకొని పనిచేసే పాకీవారి మీద ఆధారపడ్డారు. యీ విషయం నాకు తెలిసింది. గుంటల్లో పడే మలాన్ని మట్టితో కప్పివేయడం, పారిశుద్ధ్య కార్యక్రమం గుంటల దగ్గర కొనసాగించడం మా బృందంవారు చేయగలరనీ, ఫినిక్సులో యిట్టిపనివారు చేశారనీ, మావారికి అనుమతి యిమ్మని డాక్టర్ దేవ్ గారిని కోరాను. ఆయన సంతోషంతో అంగీకరించారు. అనుమతించమని కోరింది నేను అయినా బాధ్యత వహించవలసిన వ్యక్తి మదన్‌లాలు గాంధీయే. డేరాలో కూర్చొని జనానికి దర్శనం యివ్వడం, వచ్చేపోయే జనంతో ధర్మాన్ని గురించి, తదితర విషయాలను గురించి చర్చిస్తూ వుండటం నా పని అయింది. ఇట్టి దర్శనం యిచ్చే కార్యక్రమంతో విసిగిపోయాను. ఒక్క నిమిషం కూడా సమయం చిక్కలేదు. స్నానానికి వెళ్లినా నన్ను చూచేందుకు జనమే జనం. పండ్లు తినేటప్పుడు కూడా జనమే జనం. ఒక్క నిమిషం కూడా నన్ను జనం వదలలేదు. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన కొద్దిపాటి సేవా కార్యక్రమాల ప్రభావం యావద్భారతావని పై అపరిమితంగా పడిందను విషయం హరిద్వార్‌లో బయటపడింది. నేను రెండు తిరగలి రాళ్ల మధ్య పడి నలిగిపోసాగాను. గుర్తించబడనిచోట మూడో తరగతి రైలు ప్రయాణీకుడిగా నరకయాతన అనుభవించాను. గుర్తింపబడిన చోట విపరీతమైన జనసమర్దంతో నానా యాతన పడ్డాను. రెండింటిలో ఏది మేలైనదీ అని అడిగితే చెప్పటం కష్టం. రెండూ రెండే. దర్శనం కోసం ఎగబడే జనాన్ని చూచి ఒక్కొక్కప్పుడు నాకు కోపం బాగా వచ్చిన ఘట్టాలు వున్నాయి. ఆ తాకిడికి తట్టుకోలేక లోలోన బాధపడిన క్షణాలు అనేకం వున్నాయి. కాని మూడో తరగతి ప్రయాణం చేస్తున్నప్పుడు యమయాతన పడ్డానేకాని ఎప్పుడూ కోపం రాలేదు. పైగా మూడవ తరగతి ప్రయాణం వల్ల పలు అనుభవాలు పొంది ఔన్నత్యం పొందాను.

అప్పుడు బాగా తిరగగల శక్తి నాకు వున్నది. అందువల్ల కాలినడకన బాగా తిరిగాను. రోడ్డు మీద నడవడం కూడా కష్టమయ్యేటంతగా నాకు అప్పటికి ప్రశస్తి రాలేదు. ప్రయాణాలలో ధార్మిక భావనకంటే ప్రజల్లో అజ్ఞానం, నిలకడలేకపోవడం, మొండితనం, పెంకితనం ఎక్కువగా కనబడ్డాయి. సాధువులు తండాలు తండాలుగా వచ్చిపడ్డారు. వాళ్లు పరమాణ్ణం, మాల్‌పూరీలు తినడానికే పుట్టారా అని అనిపించేలా వ్యవహరించారు. యిక్కడ అయిదుకాళ్ల ఆవును చూచి ఆశ్చర్యపడ్డాను. కాని తెలిసినవారు