పుట:సత్యశోధన.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

333

అతడు నన్నే పనిచేయమంటే మరో అనుభవజ్ఞుడైన వకీలు సలహా పొందుతానని చెప్పేవాణ్ణి. ఈ విధంగా వ్యవహరించడంవల్ల కక్షిదారులు నన్ను విశ్వసించేవారు. పెద్ద వకీలు దగ్గరకు వెళ్ళి సలహా తీసుకునేందుకు అయ్యే వ్యయం కూడా వారే సంతోషంగా భరించేవారు. అట్టి వారి ప్రేమ, విశ్వాసాలు నా ప్రజాసేవకు బాగా ఉపకరించాయి. గత ప్రకరణంలో దక్షిణ ఆఫ్రికాలో నా వకీలు వృత్తి లక్ష్యం ప్రజా సేవయేనని తెలియజేశాను. ప్రజా సేవ చేయడానికి కూడా ప్రజల విశ్వాసం పొందడం చాలా అవసరం. డబ్బు తీసుకొని నేను వకీలు పని చేసినా ఉదార హృదయంతో ప్రజలు నా పనిని సేవా కార్యంగానే భావించారు. జైళ్ళకు వెళ్లవలసి వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులు ఆ విషయం ఏమిటో తెలుసుకోకుండానే నామీద గల ప్రేమ విశ్వాసాల కారణంగా సిద్ధపడ్డారు. ఈ విషయాలు వ్రాస్తున్నప్పుడు వకీలు వృత్తికి సంబంధించిన ఎన్నో మధుర స్మృతులు నా కలాన్ని ఆవహిస్తున్నాయి. చాలామంది కక్షిదారులు నాకు మిత్రులుగా మారిపోయారు. ప్రజా సేవలో నాకు నిజమైన అనుచరులుగా వుండి నా కఠోర జీవితాన్ని సరళం చేశారు. 

47. అపరాధి జైలుశిక్ష పడకుండా తప్పించుకున్న విధానం

పారశీ రుస్తుంగారి పేరుతో ఈ ప్రకరణాల పాఠకులు సుపరిచితులే. ఆయన ఒకే సమయంలో నాకు కక్షిదారు, ప్రజాకార్యరంగంలో అనుచరుడు ఆయ్యాడు. మరో విధంగా చెప్పాలంటే ముందు అనుచరుడు తరువాత కక్షిదారు అయ్యాడన్నమాట. ఆయన విశ్వాసాన్ని నేను అపరిమితంగా చూరగొన్నాను. తన స్వంతవిషయాలేగాక తన ఇంటి విషయాల్లో సహితంగా నా సలహాలు తీసుకొని ఆ ప్రకారం నడుచుకునేవాడు. ఆయనకు జబ్బు చేసినా నా సలహా అవసరమని భావించేవాడు. మా ప్రవర్తనా తీరులో ఎంతో వ్యత్యాసం వుండేది. ఆయన తన జబ్బులకు నా చికిత్సను వాడి చూచేవాడు. ఒక పర్యాయం పెద్ద ఆపద విరుచుకుపడింది. తన వ్యాపార రహస్యాలు నాకు చెపుతూ వుండేవాడు. అయినా ఒక రహస్యాన్ని దాచివుంచాడు. పారసీ రుస్తుంజీ చెల్లించవలసిన పన్ను చెల్లించేవాడు కాదు. దొంగ వ్యాపారం సాగించేవాడన్నమాట. బొంబాయి కలకత్తా నుండి వస్తువులు తెప్పించేవాడు. ఇక్కడే దొంగ వ్యాపారం జరుగుతూ వుండేది. అధికారులందరితో ఆయనకు మంచి సంబంధాలు పుండటం వల్ల ఆయనను ఎవ్వరూ సందేహించేవారు కాదు. ఆయన చూపించిన రశీదుల్ని, పట్టీలను బట్టి పన్ను వసూలు చేస్తూవుండేవారు. అప్పుడప్పుడు కొద్దిగా అనుమానం