పుట:సత్యశోధన.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

5

రోజుల్లో చెక్కల బాక్సుకు అమర్చిన అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికి తిరుగుతూ వుండేవారు. వాళ్ళు చూపించిన చిత్రాల్లో అంధులగు తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకొని యాత్రకు వారిని మోసుకుపోతున్న శ్రవణుని బొమ్మ నా హృదయం మీద చెరగని ముద్ర వేసింది. అతణ్ణి లక్ష్యంగా పెట్టుకున్నాను. శ్రవణుడు చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రుల కరుణవిలాపం యిప్పటికీ నాకు జ్ఞాపకం వున్నది. ఆ లలిత గీతం నన్ను ద్రవింప చేసింది. నా తండ్రిగారు కొని ఇచ్చిన వాద్యం మీద ఆ గీతాన్ని ఆలపించాను కూడా. అప్పుడే ఒక నాటక కంపెనీ అక్కడికి వచ్చింది. వాళ్ళ నాటకం చూచేందుకు నాకు అనుమతి లభించింది. అది హరిశ్చంద్ర నాటకం. ఆ నాటకం నాకు బాగా నచ్చింది. కాని ఎక్కువ సార్లు ఎవరు చూడనిస్తారు! అయినా నా మసస్సులో ఆ నాటకం ప్రదర్శితం అవుతూ వుండేది. కలలో హరిశ్చంద్రుడు కనపడుతూ వుండేవాడు. అందరూ సత్య హరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అని అనుకునేవాణ్ణి. హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలచుకుని ఎన్ని ఆపదలు వచ్చినా అంతా సత్యం పలకవలసిందేనని అనుకునేవాణ్ణి. నాటకంలో హరిశ్చంద్రుడు అనుభవించిన కష్టాలన్నీ యదార్థమైనవేనని అనుకొని, హరిశ్చంద్రుని దుఃఖం చూచి, దాన్ని జ్ఞాపకం పెట్టుకుని నేను బాగా ఏడ్చేవాణ్ణి. అతడు ఐతిహాసిక పురుషుడు కాడని యిప్పటికీ నాకు అనిపిస్తుంది. నా హృదయంలో యిప్పటికీ శ్రవణుడు, హరిశ్చంద్రుడు జీవించే వున్నారు. ఆ నాటకం చదివితే యిప్పటికీ నా కండ్లు చమరిస్తాయనే నా నమ్మకం.

3. బాల్య వివాహం

ఈ ప్రకరణం వ్రాయకుండా వుండటం నాకెంతో యిష్టం. కాని కథాక్రమంలో యిట్టి చేదు మాత్రలు ఎన్నో మ్రింగవలసి వచ్చింది. సత్యపూజారిని కదా! వేరే మార్గం లేదు. వ్రాయక తప్పదు. సుమారు పదమూడోయేట నాకు పెండ్లి అయింది. యీ విషయాలు గ్రంథస్థం చేయవలసి వచ్చినందుకు విచారంగా వుంది. అయినా విధి అని భావించి వ్రాస్తున్నాను. నా రక్షణలో వున్న పన్నెండు లేక పదమూడు ఏండ్ల బాలబాలికల్ని చూస్తూ వుంటే నా పెండ్లి సంగతి జ్ఞాపకం వచ్చి నా మీద నాకే జాలికలుగుతూ వుంటుంది. నాకు పట్టిన దౌర్భాగ్యం వాళ్ళకు పట్టలేదు. కనుక వాళ్ళను అభినందించాలని వుంటుంది. పదమూడేళ్ళ వయస్సులో జరిగిన ఈ పెళ్ళిని సమర్థించుకునేందుకు నైతిక కారణం ఒక్కటి కూడా లేదు.

ప్రధానం గురించి వ్రాస్తున్నానని పాఠకులు గ్రహించాలి. కాఠియావాడ్ లో