పుట:సత్యశోధన.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

211

మాతరమా? రామరామ, ఒక్కమాటైనా మాట్లాడటానికి వీలు పడదు.” ఆ మాటలు పలికిన ఆ నిర్మల హృదయుని మీద నాకు జాలి కలిగింది.

ఇటువంటి దర్బారు మరొకటి నాకు బాగా గుర్తు వుంది. లార్డ్ హార్జింజ్ బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన కావించిన చోట ఒక దర్బారు ఏర్పాటు చేశారు. అందు రాజులు, మహారాజులు పాల్గొన్నారు. భారత భూషణ మాలవ్యాగారు నన్ను అక్కడికి రమ్మని పట్టుబట్టారు. నేను అక్కడికి వెళ్లాను. కేవలం స్త్రీలకు శోభ చేకూర్చే వారి వస్త్రాలు, ఆభరణాలు చూచి నాకు ఎంతో విచారం కలిగింది. పట్టు పాజామాలు, పట్టు అంగరఖాలు, మెడలో ముత్యాలు, వజ్రాల హారాలు, బాహువులకు బాజా బందులు, తలపాగాకు వజ్రాలు, ముత్యాలు పొదిగిన తురాయిలు, వీటన్నిటితో బాటు నడుముకు బంగారు పిడిగల కరవాలాలు. ఇవన్నీ ఏమిటి? రాజచిహ్నాలా! లేక దాస్య చిహ్నాలా? యిట్టి నామర్దా కలిగించే నగలు వారే తమ యిష్ట ప్రకారం చేసుకున్నారని అనుకున్నాను. కాని యిట్టి దర్బారులకు యిట్టి వేష భూషాదులు వేసుకు రావడం వారి విధి అని తెలిసింది. కొందరు రాజులకైతే యిట్టి వస్త్రాలు, నగలు అంటే అసహ్యమనీ, యిట్టి దర్బారుల్లో తప్ప మరెప్పుడూ వాటిని తాకరని కూడా తెలిసింది. యీ మాట ఎంతవరకు నిజమో నాకు తెలియదు. యితర సమయాల్లో వారు వాటిని ధరిస్తారో లేదో తెలియదు. ఏది ఏమైనా వైస్రాయి దర్బారైతేనేమి మరే దర్బారైతేనేమి ఆడవాళ్లలా వీళ్లు నగలు ధరిస్తారని తెలిసి విచారం కలిగింది. ధనం, బలం, మానం, యివి మనుష్యులచేత ఎట్టి పాపాలనైనా ఎట్టి అనర్ధాలనైనా చేయిస్తాయి కదా! 

17. గోఖ్లేగారితో ఒక మాసం - 1

మొదటి రోజునే గోఖ్లేగారు నాకుగల మొహమాటాన్ని పోగొట్టారు. నన్ను తమ్మునిలా చూచారు. నా అవసరాలేమిటో తెలుసుకొని వాటిని పూర్తిచేశారు. అదృష్టవశాత్తు నాకు కావలసినవి కడు స్వల్పం. నా పనులన్నీ స్వయంగా చేసుకోవడం నాకు అలవాటు. కనుక నా కోసం చేయవలసిందేమీ లేదు. నా పనులు నేను చేసుకోవడం, నియమబద్ధమైన నడవడి, నా దుస్తులతీరు యివన్నీ చూచి ఆయన విస్తుపోయారు. నన్ను అమితంగా స్తుతించడం ప్రారంభించారు.

వారు నాదగ్గర ఏమీ దాచేవారు కారు. తమను చూడవచ్చిన వారందరినీ నాకు పరిచయం చేసేవారు. అట్టి పరిచితుల్లో డాక్టరు ప్రపుల్ల చంద్రరాయ్‌గారు ముఖ్యులు. వారు పొరుగునే వుండేవారు. తరుచు వస్తూ వుండేవారు.