పుట:సత్యశోధన.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

ధర్మ నిరీక్షణ

Mahamd and His successars” అను గ్రంథాన్ని, కార్లయిలుగారి మహమ్మదు స్తుతిని చదివాను. దీనిచే నాకా మత ప్రవక్త యెడ ఆదరం పెరిగింది. “the sayings of zarthustra” అను గ్రంథం కూడా చదివాను. ఈ విధంగా వివిధ మతాల్ని గురించి కొద్దిగానో గొప్పగానో తెలుసుకున్నాను. దీనివల్ల ఆత్మ నిరీక్షణ పెరిగింది. చదివిన దానిలో మంచిదని తోచిన అనుభవాన్ని ఆచరణలో పెట్టసాగాను. యిదేవిధంగా యోగ సంబంధమైన గ్రంథాల్ని కూడా చదివి సాధన ప్రారంభించాను. కాని ఎక్కువ కాలం ఆ సాధన సాగించలేకపోయాను. భారతదేశం వెళ్లిన తరువాత ఒక గురువు దగ్గర అభ్యసించాలని భావించాను. కాని ఆ కోరిక ఈనాటి వరకు నెరవేరలేదు.

టాల్‌స్టాయి పుస్తకాలు అధికంగా చదివాను. వారి “The Gospels in Brief, What to do?” మొదలగు గ్రంథాలు నా హృదయానికి హత్తుకున్నాయి. విశ్వప్రేమ మనిషిని ఎంత పైకి తీసుకొని వెళ్లగలదో తెలుసుకోగలిగాను. ఈ సమయంలోనే నాకు మరో ఏసు కుటుంబంతో పరిచయం కలిగింది. వారి మాట ప్రకారం ప్రతి ఆదివారం వెస్లియస్ చర్చికి వెళ్లసాగాను. అచ్చటికి వెళ్లినప్పుడల్లా వారింట్లోనే విందు తీసుకోమని ఒక్కసారే నాకు వారు చెప్పివేశారు. ఆ చర్చిలో ప్రవచనం నిస్సారంగా వుండేది. అచటి మండలి భక్త మండలి కాదు. వారంతా ఐహిక చింతకులు. లోకాచారం కోసం, విశ్రాంతి కోసం వారు చర్చికి వెళ్లేవారు. నాకు అక్కడ నిద్ర వస్తూ వుండేది. అలా నిద్రపోవడం నాకు చిన్నతనంగా వుండేది. కాని నాతోబాటు కునుకు తీసే మిత్రులు కొందరుండటంవల్ల నా చిన్నతనం తగ్గిపోయింది. ఈ స్థితి నాకు నచ్చలేదు. చివరికి అక్కడికి వెళ్లడం మానుకున్నాను.

నడుస్తు నడుస్తూ వున్న ఆ కుటుంబం పొత్తు అంతటితో ఆగిపోయింది. యిక రావద్దని ఆ కుటుంబం వారు చెప్పినట్లు భావించవచ్చు. ఆ ఇల్లాలు చాలా మంచిది. రుజువర్తన కలది. అయితే ఆమెది సంకుచిత స్వభావం. మా పని ఎప్పుడూ మత చర్చయే. నేనప్పుడు ఆర్నాల్డుగారి “Light of Asia” చదువుతూ వున్నాను. అప్పుడు ఒక పర్యాయం బుద్ధునికి, ఏసుకు గల తారతమ్యాన్ని గురించి చర్చ వచ్చింది. నేను యిలా అన్నాను.

“అమ్మా! చూడు బుద్ధునిదయ! అది మనుష్యులతో ఆగక సకల భూతముల దాకా వ్యాపించింది. అతని భుజం మీద సంతోషంతో కూర్చున్న మేకపిల్ల చిత్తరువు కండ్ల యెదుట కనబడితే హృదయం ప్రేమతో నిండిపోతుంది. కాని ఏసులో యీ విధమైన సర్వభూత వ్యాప్తమగు దయ కనబడదు.”