పుట:సత్యశోధన.pdf/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
124
నేను పడ్డ మధన
 

క్రైస్తవుల పవిత్ర జీవితాలు నాకు ప్రసాదించలేదు. ఇతర ధర్మాలలో కూడా నాకు క్రైస్తవ సంస్కారాలు కనబడ్డాయి. సిద్ధాంత దృష్టితో పరిశీలిస్తే ఏసు సిద్ధాంతాలలో అలౌకికత నాకు కనబడలేదు. త్యాగంలో హిందువులు క్రైస్తవులను ఎన్నో రెట్లు మించిపోతారని నాకు విశ్వాసం కలిగింది. క్రైస్తవ మతమే సంపూర్ణమని ఇతర మతాల కంటే శ్రేష్టమైనదని నాకు నమ్మకం కలుగలేదు.

సమయం దొరికినప్పుడల్లా క్రైస్తవ మిత్రులకు నా హృదయంలో సాగిన యీ మధనను గురించి వివరించాను. వారిచ్చిన సమాధానాలు నాకు సంతోషం కలిగించలేదు.

ఈ విధంగా క్రైస్తవ మతం శ్రేష్టమైనదని కూడా నాకు నమ్మకం కలగలేదు. హిందూమత మందలి దోషాలు నా కండ్లకు కనబడసాగాయి. అస్పృశ్యత హిందూమతంలో ఒక భాగమైతే, అది జీర్ణమై పోయిన భాగం లేక అత్యాధునిక దురాచారం. ఇన్ని వర్ణాలు, ఇన్ని శాఖలు ఎందుకో నాకు బోధపడలేదు. వేదాలు అపౌరుషేయాలు అయితే బైబిలు, ఖురానులు అపౌరుషేయాలుకావా?

క్రైస్తవ మిత్రులు నన్ను ఏసు మతంలో కలపాలని ఎలా ప్రయత్నించారో, అలాగే మహమ్మదీయులు తమ మతంలో కలుపుకునేందుకు ప్రయత్నించారు. అబ్దుల్లా సేఠ్ మాటిమాటికీ ఇస్లాం మత గ్రంధాలు చదవమని మరీమరీ చెబుతూ వుండేవాడు. ఆయన ఎప్పుడూ ఇస్లాం మత ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ వుండేవాడు.

ఈ విషయాలన్నీ కవిరాయచంద్ భాయీకి జాబు ద్వారా తెలియజేశాను. భారత దేశమందున్న యితర విద్వాంసులకు కూడా జాబులు వ్రాశాను. సమాధానాలు కూడా చాలా వచ్చాయి. రాయచంద్‌భాయి వ్రాసిన జాబు నాకు కొంత సంతృప్తిని కలిగించింది, “ఇంకా లోతుగా హిందూమతాన్ని తెలుసుకో” అని రాయచంద్ వ్రాశారు. “పక్షపాతం మాని పరిశీలిస్తే హిందూమత సిద్ధాంతాల యందున్న సూక్ష్మత, గాంభీర్యం, ఆత్మ వివేకం, దయ, ధర్మ నిర్ణయం వంటి విశేషాలు ఇతర మతాల్లో కనబడవు” అని కూడా ఆయన వ్రాశారు.

సెల్‌గారి ‘ఖురాను’ అనువాదం చదివాను. మరికొన్ని ఇస్లాం మత గ్రంథాలు కూడా సంపాదించాను. ఇంగ్లాండు నందలి క్రైస్తవ మిత్రులకు ఉత్తరాలు వ్రాయసాగాను. ఆ మిత్రులలో ఒకరు నాకు ఎడ్వర్డు మెయిట్లండుగారిని పరిచయం చేశారు. వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. అన్నా కింగ్స్‌ఫోర్డు గారును, తానును కలిసి