పుట:సత్యశోధన.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

117

సోదరుని పరిచయం కలిగింది. వారి సోదరుడు జోహాన్స్‌బర్గ్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటరు. బోయర్ యుద్ధంలో ఒక ఉద్యోగిని ఖూనీ చేయుటకు కుట్ర పన్నాడని నేరం మోపి ఆయనకు ఏడేండ్ల కారాగార శిక్ష విధించారు. ఆయన పట్టా కూడా రద్దు చేశారు. యుద్ధం ముగిసిన తరువాత ఆయనను విడుదల చేశారు. తిరిగి ఆదరించి ఆయనను కోర్టులో చేర్చుకున్నారు. ఆయన మళ్లీ ప్లీడరు పని చేయసాగారు.

ఈ పరిచయాలు తరువాత ప్రజాసేవ చేయడానికి పూనుకున్నప్పుడు నాకు ఉపయోగపడ్డాయి.

రోడ్డు మీద నడుచుటకు సంబంధించిన శాసనం కూడా ఎంతో యిబ్బంది కలిగించింది. నేనెప్పుడూ ప్రెసిడెంటు వీధికి ఆవలనున్న మైదానానికి షికారుకు పోతూ పుండేవాణ్ణి. యీ వీధిలోనే ప్రెసిడెంట్ క్రూగరు గారి గృహం ఉంది. ఆ గృహం నిరాడంబరంగా వుండేది. దాని చుట్టు తోటగాని, దొడ్డిగాని లేదు. సామాన్య గృహంలా వుండేది. ప్రిటోరియాలో కోటీశ్వరుల యిండ్లు దివ్య భవనాలు. వాటియందు నందనవనాలు అధికంగా వుండేవి. కాని ప్రెసిడెంటుగారు నిరాడంబరులు. ఆ యింటి ముందు పోలీసుల కాపలా వుండటం వల్ల అది రాజ్యాధికారి గృహమని తెలుస్తుంది. నేనెప్పుడూ ఆ పోలీసుల ప్రక్కగా వెళుతూ వుండేవాణ్ణి. అయితే ఆ పోలీసులు ఎప్పుడూ నా జోలికి రాలేదు.

అక్కడ వంతుల ప్రకారం పోలీసులు మారుతూ వుంటారు. ఒకనాడు ఒక పోలీసు నన్ను చూచాడు. కనీసం ముందుగా హెచ్చరిక అయినా చేయకుండా తిన్నగా మీదికి వచ్చి కొట్టి నన్ను నెట్టివేశాడు. నేను నివ్వెరబోయాను. దెబ్బలు తగిలాయి. నేను ఆ పోలీసును ఏమీ అనలేదు. ఇంతలో గుర్రం మీద అటుగా వెళుతున్న కోట్సు దొర అక్కడకు వచ్చి “గాంధీ! నేనంతా చూచాను. నీవు వీనిపై కేసు పెట్టు. నేను సాక్ష్యం యిస్తాను. నీమీద యితడు చెయ్యి చేసుకున్నందుకు విచారిస్తున్నాను” అని అన్నాడు.

“ఇందు విచారించనవసరం లేదు. పాపం ఆ పోలీసు వాడికేమి తెలుసు? అతడికి నల్లవాళ్ళంతా సమానులే. అతడు నామీద చెయ్యి చేసుకున్నట్లే నీగ్రోల మీద కూడా తప్పక చెయ్యి చేసుకుంటాడు. నాకు ఏ అపాయం కలిగినా కోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల యితని మీద కేసు పెట్టను” అని అన్నాను.

“నీ పద్ధతి నీదే. ఆలోచించుకో. ఇట్టివాడికి ఒక్క పర్యాయం శాస్తి చేయడం అవసరం” అని కోట్సుగారన్నాడు. ఆ తరువాత ఆయన పోలీసువాణ్ణి కోప్పడ్డాడు.