పుట:సత్యభామాసాంత్వనము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

సత్యభామాసాంత్వనము

     పాలకాయొంట్లును బావిలీ ధరియించి
                    ప్రోదిగాఁ జెవుల జవ్వాది నించి
తే. తళుకుజిగిమించు సరిగంచు తమ్మిపూల
     వ్రాఁతపనిదుప్పటిని వల్లెవాటు వైచి
     కడఁక తగ నెంచి కొల్వుసింగార మిటులు
     చేసికొనె శౌరి యెన లేని చెలువుమీఱి.

తే. వెనుక నెదుటను నిలిచిన వెలఁదు లెల్ల
     దనమొగముఁ జూడ సామియందంబుఁ జూచి
     కొమలజడవ్రేటులును పచ్చిగోళ్లసోఁకు
     లెన్ని చూచిన ననఁ డేమి వెన్నుఁ డపుడు.

వ. తదనంతరంబ నితంబినీనినంబవిలంబమానమణిమేఖలాకలకల
     మ్ములును, కంజాననాచరణకంజసింజానమంజుమంజీరఝళంఝళంబులును,
     పంకజముఖీపాణిపంకరుహచంకనత్కనకకంకణఝణఝణత్కారంబు
     లును, విధుముఖీజనకబరీనిబిరీసమరువకకురువకఫుల్లమల్లికాగంధాను
     బంధగంధోదయపుష్పంధయస్తనంధయఝంకారంబులును, విచిత్రతర
     వేత్రిణీలోకవిజ్ఞాపితవిజయహోంకారంబులుసు, వివిధహృద్యవాద్యసన్నాహ
     సమయచిరత్నావిరళనాదంబులుసు, గ్రమ్ముకొన నమ్మానవతులును కమ్మ
     విలుకానిఁ గన్నసామియును ముందుముందుగా నానందంబు డెందంబునఁ
     గ్రందుకొనఁ జెందిరపువన్నెగందపుప్పొళ్ల చెందమ్మిరేకులచల్లు లాడం దగి
     నగరెల్ల ఘూర్ణిల్లె నంత.

ఉ. పౌజులు రాజులున్ నగరిబైల రయమ్ముగ నేఁగఁ దత్పురాం
     భోజదళాక్షులున్ చిఱుతబోడికలు న్నికటోర్వి రాఁగ నా
     నాజనులుం దొలంగురవణంబున కట్టికవారు గొల్లలున్
     రాజపథంబునం గడుబరాబరి సేయ మహాద్భుతంబుగన్.

సీ. బలుగొల్సు లెనయించి బండ్లపై నుంచి కుం
                    కుమ నించుబంగారుకొప్పెరలును