పుట:సత్యభామాసాంత్వనము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

సత్యభామాసాంత్వనము

     మానమున శౌరిఁ గనఁగోరి మస్తుమీఱి
     సరగునను వచ్చె నటు చేరి జంభవైరి.

ఉ. వచ్చి విమానమున్ డిగి తి, వాసులు దిండ్లు పరంగిపీఁటలున్
     నిచ్చలు ముందుగా నడువ నీలపురాబిరడల్ పొసంగఁ గ్రొం
     బచ్చలచిల్కకెంపురవపావలు మెట్టి పులోమకన్య చె
     య్యిచ్చిన నాని యాబుధకులేంద్రుఁడు రాఁ గని విస్మితాత్ముఁడై.

సీ. చేరి రుక్మిణియిచ్చు చేలాగు రహిఁ బూని
                    సత్యమూ పొకయింత సందిటాని
     మఱి జాంబవతి యిచ్చుమడుపు వాతెర నంది
                    పొంత రవిజగుబ్బపోటుఁ జెంది
     భద్రతోఁ బౌలోమిబా గాగడము చేసి
                    యోరటిల్లి సుదంతఁ జేరణదీసి
     విరులచే నలమిత్రవిందవేనలి రువ్వి
                    సరిగ లక్షణనీవి సడల నవ్వి
తే. యుదిరివీడెము వెడజాఱ హొయలు మీఱ
     సిగను పింఛంబు నటియించ సొగసు మించ
     హౌసు లొనగూడ హారంబు లల్లలాడ
     లేచె బలుదేవ నాసవ్యసాచిబావ.

క. పడఁతి యొకతె కుచభరమున
     జడియుచు మై వంచి పట్టి సమ్మాళిగలన్
     దొడుగం బదములఁ గొని యె
     క్కుడురాజస మొప్ప నెదురుకొనె నయ్యిండ్రున్.

ఉ. అత్తఱి సజ్జక్రింద నసురాంతకుకట్టికవారు జాళువా
     బెత్తము లాని యంతటను బెట్టు బరాబరి సేయ బెట్టుపై
     హత్తినరాజలోక మమరావళియున్ మకుటంబు లూడఁగాఁ
     దత్తర మంది వీఁగ వనిత ల్బలవైరియుఁ దక్క దవ్వులన్.