పుట:సత్యభామాసాంత్వనము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తంజావూరు వీర రాహూతుల పాలనలో, ఆంధ్రవాణి ఏలా వింతవిలాసములతో చవులూరించి, కావ్యరసికులకు హాయి నలవరచిందో రాధికాసాంత్వనముతో విశదమై ఉంటుంది.

సత్యభామాసాంత్వనము, మథురనాయకుల కీర్తిని చిరస్థాయిగా నిలిపే సప్తసంతానములలోనిది. కృతిపతి, తిరుమలనాయకుని మనుమడు అళఘరి, తిరుమలేంద్రుడు, క్షేత్రయ్యను సముఖానికి రప్పించుకొని బహుకాలము నిలుపుకొన్న సరసనాయకుడు. (కృతిపతిని మెప్పించడానికీ, క్షేత్రయమీది ఆదరణచేతా, శ్రీ కామేశ్వరకవి, పదభావములను అక్కడక్కడ సంతరించి వినియోగించుకున్నాడు) తాతను బోలిన మనుమడే అళఘరికూడాను, అన్నివిధములచేతా అని, శ్రీ కామేశ్వర కవి స్పష్టంగా చెపుతున్నాడుకదూ, గ్రంథారంభంలో. అళఘరి అన్న చొక్కనాథుడు కూడా శృంగార అనుభవాల విషయంలో వీరెవరికీ తీసిపోనివాడు అనిపించుకున్నాడు రాజ్యానికి వచ్చిన తరువాత. ఈతని మీద, షోకైన చాటువులు శరభోజీ భాండారంలో ఉన్నవి.

శ్రీ కామేశ్వర కవిది విశేషించి ప్రౌఢమైన కవిత్వం. దానికి వన్నెగా, అచ్చతెలుగులూ, దేశ్యాలూ, సంస్కృతానికి తూకం తరిగి పోకుండా ఉండేటట్టు తలమున్కలుగా గంథమంతటా విరజల్లేశాడు. అందుచేత వ్రాతప్రతులనిండా, విలేఖరుల దోషాన స్ఖాలిత్యాలు అనేకం పాదుకు పోయినవి.

ముదణమునకు సాధుప్రతిని సిద్ధముచేయడానికి, పరిశోధనావసరాల్లో విశేషంగా శ్రమపడవలసి వచ్చినది. తెలుగునాటను లభ్యమౌతూన్నవానిలో, ఏప్రతినీ చూడకుండా విడువలేదు. శ్రీ కామేశ్వర కవి ఉత్తమరచనను, సహృదయులకు, అందించ గలిగినందున, మాకృషి ఫలించినది.

వ్యవస్థాపకుడు.