పుట:సత్యభామాసాంత్వనము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

5

సీ. సరసత భువనంబు చల్లనై విలసిసల్ల
                    సారస్వతస్ఫూర్తి సంపుటిల్ల
     వనమయూరాధికవాఙ్నైపుణి పొసంగ
                    రయనటద్ధారాతిశయ మెసంగఁ
     బటుతరోదితకదంబంబులు నవలొత్త
                    వెఱఁగుపడఁగనైన మెఱుఁగు హత్త
     సౌహృదకవిరాజసంఘంబు హర్షింప
                    గూలంకషాభోగలీల మించ
తే. నమృతవర్షంబు గురిసిన యట్లు ఘనత
     వెలయఁగా గీర్తికందళములు చెలంగఁ
     బ్రకృతి యంతయుఁ దనియంగ వికృతి లేని
     సుకృతి నొనరించువాఁ డౌర సుకృతి జగతి.

వ. అని యిష్టదేవతావందనంబును సుకవిజనాభినందనంబును గుకవి
     నిందనంబునుం గావించి యే నభంగురశృంగారరసతరంగిత వచనరచనాను
     బంధం బగు నొక్కప్రబంధంబు నిర్మించ నెంచి యున్న సమయంబున:

క. లక్షణలక్షితకమలా
     వీక్షణపుంఖానుపుంఖవిభవోన్మేషా
     నుక్షణతతివిశ్రుతి యై
     దక్షిణమధురాపురంబు తనరు ధరిత్రిన్.

శా. అవీట న్విధుకాంతసంతతి సమ్ముద్యద్రుక్మసాలాంతరా
     శావిర్భూతవిడూరజాతమయకుడ్యప్రాంగణాధ్యాతత
     క్ష్మావజ్రోపలవేదికాగ్రరుచిమచ్ఛక్రాశ్మవేశ్మాంశురే
     ఖావల్గద్రవిజాతరంగమణిరంగత్తుంగసౌధంబునన్.

మ. జనులం జల్లనిచూపులం దనుపుచున్ శంపాలతాంగుల్ నయం
     బున వేవేల్ తనచెంతఁ జేరి యుడిగంబుల్ సేయ నంతంతకున్
     ఘనతన్ దిక్కులరాజు లెల్లఁ బొగడం గర్ణాటరాజ్యేందిరం
     గనుసన్నన్ వరియించె ముద్దళఘరిక్ష్మాజాని రంజిల్లుచున్.