పుట:సకలనీతికథానిధానము.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

సకలనీతికథానిధానము


క.

చందనము చలువ జగములఁ
జందనమునకంటెఁ జలువ చంద్రుఁడు మఱి య
చ్చందనచంద్రులకంటెను
పొందుగ శైత్యములు సుజనపురుషుల పలుకుల్.

129


క.

కులపత్ని యొక్కతియు, మఱి
హలయుగమును, నందనత్రయంబునుఁ బదియా
వులు మధ్యరాష్ట్రమునుఁ, దగ
ఫలియించెడునిలయు, నునికిపట్టుకు నమరున్.

130


ఆ.

కన్నె రూపు గోరు కనకంబుఁ గోరును
దల్లి చదువు గోరు తండ్రి బంధు
జనము కులముఁ గోరు సౌఖ్యభోజన మిల
జనము గోరు నిదియ జగతినురవు.

131


ఆ.

గుఱ్ఱమునకు మోపుగుణమును గన్నెకుఁ
దల్లిగుణము పుడమి పుట్టుగుణము
నవనినిర్జరులకు నాచారగుణమును
దెలిసికొనఁగవలయుఁ గలితబుద్ధి.

132


క.

తమవారి బాసినను, ను
త్తమమిత్రుండైన మిగులఁదాపము సేయున్
గమలంబు నీటఁ బాసిన
కమలాప్తునివేఁడిచేతఁ గమలినభంగిన్.

133


వ.

రాజవాహనుమంత్రి శ్రుతకీర్తి మఱియు నిట్లనియె.

134


క.

న్యాయమునఁ బెరుగు ప్రజ, నర
నాయకునకు సిరియుఁ బెరుగు నానాఁటికి న
న్యాయంబుఁ దలఁచు ధరణీ
నాయకునకు సిరియుఁ బ్రజయు నాశముఁ బొందున్.

135