పుట:సకలనీతికథానిధానము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

సకలనీతికథానిధానము


వ.

దండప్రణామంబులు సమర్పించి యేను రచియింపంబూనిన సకలనీతికథానిధానంబునకు నుపక్రమం బెట్టిదనిన.

35


ఉ.

సారసపత్రనేత్రుఁడు ప్రసన్నత నొంది స్వకీయమందిర
ద్వారము గాఁచియుండ బలిదైత్యవరుండు రసాతలంబు దు
ర్వారత నేలె నాగపురవల్లభమానససంచరప్రతా
పోరుభుజప్రవృత్తిని మహోగ్రశరాసనబాణహస్తుఁడై.

36


ఉత్సాహ.

నాగలోక మిట్లు దైత్యనాథుఁ డేలుచుండియున్
యాగ మద్భుతంబుగా మురారి గూర్చి సేయుచో
భోగవతిని తీర్థమాడఁ బోయి యంత నారదుం
డాగరిష్ఠు యజ్ఞశీలు నట్లు చూడవచ్చుడున్.

37


వ.

అర్ఘ్యాదివిధులం బూజించి తోడ్కొని తెచ్చి యుచితపీఠంబున నుపవిష్టుం జేసి కరపుటఘటితనిటలుండై వినయోక్తుల నిట్లనియె.

38


ఆ.

బ్రహ్మతనయ! నీదురాకకు గత మేమి
యద్భుతంబు వొడమె నాత్మ ననిన
సకలలోకములును జరియించి నిను జూడ
వచ్చినాఁడ దైత్యవర బలీంద్ర.

39


క.

మీవాకిళ్లే గతియని
యావనమాలియును హరుఁడు ననవరతంబున్
నీవాకిలియును నీసుతు
నావాసము గాచియుందు రట్టె మహాత్మా.

40


ఆ.

అనిన బ్రహ్మమునికి నబ్బలిదైత్యేంద్రుఁ
డనియె గలియుగంబునందుఁ బుడమి
జనుల వర్తనంబు జనపాలచరితంబు
వినఁగవలయు ననిన మునియుఁ బలికె.

41