Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమ్లజని


1902వ సంవత్సరములో “లిండే" అను వైజ్ఞానికుడు ద్రవరూపములో నున్న గాలి యొక్క సవరణ విధానము (Rectification of Liquid air) వలన 98.5% పరిశుభ్రత గల ఆమ్లజనిని తయారు చేయగలిగెను.

విద్యుద్విశ్లేషణము (Electrolysis) ద్వార ఉదజనిని తయారుచేయుటలో ఆమ్లజని ఉపఫలితముగా (Bye-product) లభించును. కాని ఈ పద్ధతికి విద్యుచ్ఛక్తి విరివిగా కావలసియుండుటచే వాయు ద్రవీకరణ పద్ధతి ఎక్కువ ఉపయోగములోనికి వచ్చినది.

ఈ వాయువును 120-150 వాతావరణపీడనములో (atmosphere's pressure) ఉక్కు సిలిండరులలో నుంచి సరఫరా చేయుదురు. 1926 వ సంవత్సరములో ప్రపంచపు ఆమ్లజని ఉత్పత్తి 5000 ఘనపుటడుగులు.

పైరో గెలాల్ (Pyrogallol) యొక్క క్షారక ద్రావణము వలన గాని, అమ్మోనియాతో కూడిన అమ్మోనియ కర్బనిత (అమ్మోనియం కార్బొనేటు) ద్రావణముతో తామ్రము యొక్క చేరిక వలన గాని, భాస్వరపు కడ్డీల వలన గాని, సోడియ ఉదజగంధకితము (సోడియం హైడ్రో సల్ఫైటు) యొక్క నీరస క్షారక ద్రావణము వలన గాని, వాయువులో గల ఆమ్లజని యొక్క భాగము నిర్ణయించవచ్చును.

ఆమ్లజని లేత లేత మబ్బురంగుగల అయస్కాంత ద్రవముగా ద్రవీకరించును. ఈ ద్రవము 182.97°c వద్ద మరుగును. త్వరగా ఇగిర్చి చల్లార్చుట వలన ఆమ్లజని లేత నీలిరంగుగల ఘన పదార్థముగా ఘనీభవించును. ఇది 219°C వద్ద కరగును. వాయురూపములోనున్న ఆమ్లజనికి నిశ్శబ్ద విద్యుత్ప్రయోగము వలన (silent electric discharge) అస్థిరమైన ఆమ్లజని రూపాంతరమగు "ఓజోన్" (Ozone) తయారగును.

ఉపయోగములు :. చాల వరకు ఆమ్లజని లోహములను అతికించుటకు, కరిగించుటకు ఉపయోగింపబడును. సాధారణముగా ఆమ్లజని ఏసిటిలీన్ (acetylene) వాయువుల మంట (Oxy-acetylene flame) సహాయముచే లోహములు అతుకబడును. జ్వలన మునకు పూర్వము ఈ రెండు వాయువులును ఊదుడు గొట్టములలోనికి సరఫరా చేయబడి బాగుగా మిశ్రమము చేయబడును.

ఆమ్లజని విస్తారముగా వైద్య విధానములోను, న్యుమోనియా, గుండెజబ్బులు మొదలగు వ్యాధులలో శ్వాసక్రియకును, విష వాయువులను పీల్చుటవలన గలుగు దుష్ఫలములను నిర్మూలించుటకును ఉపయోగింపబడును.

ద్రవరూపములోనున్న ఆమ్లజని యొక్క పారిశ్రామిక ఉపయోగములు చాల కలవు. వాయు కర్బనపు (Gas carbon) కడ్డీలను ఒక చివర చివర ఎఱ్ఱగా వేడిచేసి ఆమ్లజని ద్రవములో ముంచినచో ఎక్కువ కాంతితో మండి అపరిమితమయిన వేడిని ఇచ్చును. అపుడు ఏర్పడిన కర్బనద్వి ఆమ్లజనిదము గడ్డకట్టి తెల్లని ఘనపదార్ధముగా మారును, ఆమ్లజనితో సచ్ఛిద్ర కర్బనము (Porous carbon), కఱ్ఱ బొగ్గు, దీపపు మసి, పొగమసి, జీలగబెండు చూర్ణము (Cork meal), రంపపుపొడి లేక కలపగుజ్జు కలిపిన ఏర్పడు మిశ్రమము విధ్వంసక జాంతవము (Blasting gelatin) కంటే రెట్టింపు శక్తిగల ప్రేలుడు పదార్థముగా తయారగును. తుపాకిమందు, నత్రజని సమ్మేళనములు మొదలగు ఇతర ప్రేలుడు పదార్థములలోవలె ఆమ్లజని ఇతర మూలపదార్ధములో రాసాయనిక సంబంధము చెందక, స్వేచ్ఛగా నుండుటచే పై మిశ్రమము అంత శక్తిమంత మయినది. అతిశీఘ్రముగా (instantaneously) కర్బనము ఉదజని మొదలగు పదార్థములు ఆమ్లజనీకరణము చెందుటచే ఈ ప్రేలుడు ఏర్పడును.

ఆమ్లజని, సంయోగిక వాయువును...Synthetic gas... (ఉదజని కర్బన ఆమ్లజనిదము Carbon monoxide) తయారుచేయుటలో ఉపయోగింపబడును. (Methane ఆమ్లజనితో అసంపూర్ణ సంయోగము చెందినపుడు ఎసిటిలీన్ Acetylene ఏర్పడును.) నత్రికామ్లము (నైట్రిక్ ఆసిడ్) తయారుచేయు విధానములలో కూడ ఆమ్లజని ఉపయో గింపబడును.

అనావృతమగు పొయ్యిగల (Open hearth) ఉక్కు కొలిమిలో సంయోగమునకును, కార్బనును వేరుచేయుటకును, విద్యుత్ ఉక్కుకొలిమిలో కర్బన నిస్సారణమున కును (Decarbonisation), పాడుపడిన యినుప వస్తువులను కరగించుటకును, గాలి కొలిమిలో తక్కువరకపు ఖనిజమును కరగించుటకును ఆమ్లజనితో పరిపుష్టత చెందిన వాయువు ఉపయోగింపబడును.

జూ. ల