ఆఫ్రికా
పండ్లు, కూరగాయలు, తిండిగింజలు, పండింపబడు చున్నవి. ప్రత్తి, ఇంగువ చెట్లు ఎక్కువగా పెరుగుచున్నవి. ఊలు, చర్మములు, ముఖ్యముగా కరాకులీస్ అను గొజ్జె చర్మములు ఎగుమతి చేయుచున్నారు. దేశములో కొన్ని ఖనిజములుకూడ ఉన్నవి. రాగి, ఇనుము, సీసము ఎక్కువగా దొరకునని తెలియుచున్నది. కాబూలు పట్టణములో అగ్గిపెట్టెలు, గుండీలు, చర్మము, చెప్పులు, రాళ్ళు, కుర్చీలు చేయు చిన్న చిన్న కర్మాగారాలు ఉన్నవి. కాందహారులో ఊలు ఫ్యాక్టరీ ఉన్నది. ప్రత్తి కర్మాగారాలు ఉన్నవి. ఆఫ్ఘన్ జాతీయ బ్యాంకు ఆధ్వర్యము క్రింద దేశములో జల విద్యుచ్ఛక్తి, గుడ్డలు, పంచదార, సిమెంటు, ప్రత్తి, కర్మాగారాలు నిర్మించుటకు కృషి జరుగుచున్నది. దిగుమతి సరకులలో పెక్కింటికి ప్రభుత్వానికి గుత్త హక్కు (Monopoly) ఉన్నది. వీటి పర్యవేక్షణ నిమిత్తము రియాసత్ - ఇ - ఇన్హి సారాత్ -ఇ-దౌలతీ అను పేరుగల ప్రభుత్వ గుత్త హక్కుల అభివృద్ధి సంఘమును స్థాపించి, మోటారు కారులు, పంచదార, సిగరెట్లు మొదలైనవాటిని దిగుమతి చేసికొనుచున్నారు. ఎగుమతుల విషయములో పనిచేయుటకు అనేక కంపెనీలు ప్రత్యేకముగా ఒక్కొక్క వస్తువును సేకరించి ఇతర దేశాలకు పంపుచున్నవి. నూటికి 80 వంతుల వ్యాపారము పాకిస్థానుగుండా పోవలసి ఉండును. ఆఫ్ఘను జాతీయ బ్యాంకునకు లండనులో ఒక శాఖ ఉన్నది. భారత దేశముతో వ్యాపార సంబంధాలు ఎక్కువగా ఉన్నవి. ఆఫ్ఘని స్థానములో రైళ్ళులేవు. నౌకాయానమునకు పనికివచ్చు నదులును లేవు. బరువులు మోయుటకు ఒంటెలను, గుఱ్ఱములను దేశీయులు ఇప్పటికిని ఉపయోగించుచున్నారు. మోటారు రవాణా విధానము క్రమముగా వృద్ధిచెందుచున్నది. సుమారు 6,000 మైళ్ళ రోడ్లుం మోటారు రవాణాకు తగినవిగా నున్నవి.
డి. వి. కె.
ఆఫ్రికా :- సరిహద్దులు: ఆఫ్రికాఖండము 37½° ఉత్తర అక్షాంశమునుండి 35° దక్షిణ అక్షాంశము వరకును, 17॰ పశ్చిమ రేఖాంశమునుండి, 50½° తూర్పు రేఖాంశమువరకును వ్యాపించియున్నది. దీని వైశాల్యము 1,12,62,000 చ.మై. ఇది కాక 2,39,000 చ.మైళ్ళు వైశాల్యముకల ద్వీపము ఒకటి ఈ ఖండములోనున్నది. వైశాల్యమునందు ఈ ఖండము హిందూదేశమునకు సుమారు ఆరు రెట్లున్నది. ట్యునీసియాలోని కేప్ బాన్ నుండి కేవ్ అగలస్ వరకు ఉత్తర, దక్షిణములుగా దీని పొడవు 5000 మైళ్ళు. అదేవిధముగా పడమరనున్న కేవ్ వెర్ట్ నుండి తూర్పున నున్న గార్డిఫ్యూ వరకు దీని పొడవు 4600 మైళ్లు. ముఖ్యమైన విషయమేమన, ఈ ఖండము భూమధ్యరేఖకు ఉత్తర దక్షిణములందు సమముగా వ్యాపించియుండుట. అందువలన ఉత్తర దక్షిణ ఆఫ్రికాల శీతోష్ణమండలములందు, మరియు అనేక ఇతర విషయములయందు చాల పోలికలు కానవచ్చును. ఈ ఖండము యొక్క విశేషభాగము కర్కాటక మకర రేఖల మధ్యనుండుట గమనింపదగినది.
మధ్యధరా సముద్ర ముత్తరమునను, ఎఱ్ఱ సముద్ర మీశాన్యమునను, హిందూమహాసముద్రము తూర్పుదక్షిణములను, అట్లాంటిక్ మహాసముద్రము పడమరను కలిగియుండుటచే నీ ఖండము ద్వీపఖండమనవచ్చును,
ఫ్రెంచి భూమధ్య రేఖాగత ఆఫ్రికావంటి గినీసింధు శాఖయు, అంగోలా రాష్ట్రమునంటి లోబిటో అఖాతమును, డెలగోవా అఖాతమును ఈ ఖండమునందు పేర్కొనదగిన సముద్ర వ్యాపనములు. ఈ ఖండపు సముద్రతీరము సరళమై 19,000 మై. పొడవు కలిగి యున్నది.
మెడగాస్కరు ద్వీపము మొజాంబిక్ విస్తృత జల సంధిచే భూఖండమునుండి వేరుచేయబడినది. హిందూ మహా సముద్రము లోనికి చొచ్చుకొనివచ్చి కొమ్మువలె కనపడు భాగమును ఆఫ్రికా శృంగము అని అందురు.
నైసర్గికస్వరూపము :- ఆఫ్రికాఖండము 2000 అ. సరాసరి యెత్తుగల పీఠభూమి. దీనిని రెండు ముఖ్యమైన భాగములుగా విభజింపవచ్చును. 1. పీఠభూమి 2 తీరపు మైదానము. పర్వతము అని పిలువబడునవి పీఠభూమి యొక్క నిట్రమైన అంచులే. కాని వీనియందు ముఖ్యమయిన పర్వత శిఖరము లున్నవి. ఈ పీఠభూమి పడమరగా వాలి యున్నది.
మొరాకో, ఆల్జీరియా, ట్యునీసియా రాష్ట్రములలో 1500 మై. వ్యాపించి సరాసరిని 11,000 అ. ఎత్తుగల