Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/780

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక సంగీతము


వ్యతిరేకముగా జరుగుచున్నది. ఒక గాయకుని చూచి, లేదా గాయనీమణిని చూచి, మరొక గాయకుడు కాని, గాయనీమణి కాని కొంత యనుకరించి, కొంత యతిశయించి చమత్కృతులతో పాడుటకు ప్రయత్నించుట నేడు సహజమైనది. విపరీతమైన రాగాలాపనము, మితమైన స్వరము, నాజూకనదగిన క్రొత్త సంగతులు, అన్య సంగీత క్రమముతో మిశ్రమమైన కళలు, ఆలోచించి అమర్చుకొన్న రాగభాగములు, లెక్క వేసి యేర్పరచు కొన్న స్వరసమూహములు, మృదంగపు వరుసల ననుసరించి వల్లించిన ముక్తాయింపు స్వరములు, మున్నగునవి ఈ కాలమునందలి కొందరి శాస్త్రీయ సంగీత మునకు ప్రత్యక్ష లక్షణములుగా నున్నవి. ఇట్లు చేయుటచే సంగీత గౌరవమున కెక్కువ భంగమొనర్చినట్లైంచరాదు. అనేక పద్ధతులలో నిది యొకటియనియు, ఇట్లే ఇంకనుమార్పులు గలుగుననియు మన మూహింపవచ్చును. బహువిధముల మరొక పాతిక సంవత్సరములలో పూర్వపు పద్ధతులనే ఇట్టి విద్వాంసులు అనుసరించుట కవకాశము కలదు.

నేటి రేడియో కాలక్షేపము రెండు భాగములుగా నున్నది. ఒకటి శాస్త్రీయ సంగీతము. రెండు దేశీయ సంగీతము (Light Music), లఘుసంగీతము అనగా గాలి పాటలు, పై రెంటి లక్షణములు అనగా రాగలక్షణము, లయవిధానము, తాళనిబంధనలు సమాన మేయైనను, రెండవశాఖలో సంగీతవిశేషము సంక్షేపముగ రాగ విన్యాసమున కెక్కువ యవకాశము లేకుండ, సాహిత్యమునకు ఎక్కుడు ప్రాముఖ్యము ఏర్పడుచున్నది. విజ్ఞులకు శాస్త్రీయ, దేశీయ సంగీతములు రెంటియందును ఆనందము నొందుటకు అవకాశము గలదు. ఇతరులలో శాస్త్రీయ సంగీతమునందు ఆనంద మనుభవించువారు అరుదుగ నుందురు. దేశీయ గీతముకూడ ఆనందకరమే యగుచున్నది. ప్రజలలో సలక్షణ సంగీతమునందు రసజ్ఞత గలవారు అల్పసంఖ్యాకు లగుటచే, దేశీయ సంగీతము వర్థించువారి సంఖ్యయే యెక్కువగా గన్పట్టుచున్నది. కాని రేడియోమూలముగా ప్రదర్శింపబడు సంగీతములో శాస్త్రీయ సంగీత భాగమందు ఉన్నత కార్యక్రమములు (Concerts) ఒక గంట పదిహేనునిమిషములకు మించవు. కొన్ని కార్యక్రమములు ప్రత్యేకముగా 'రాగమునకును, తాళమునకును, పల్లవికిని వినియోగింపబడి నలుబదిఐదు నిమిషములకు మించక జరుగుచున్నవి. దేశీయ సంగీతములో ఇరువదియైదు నిమిషములకు మించుటకు వీలులేదు. ఈ నియమముల ఫలితముగా మన కీర్తనలు, రాగములు, స్వరకల్పనలు మున్నగు గాన ప్రక్రియల వైశాల్యము మిక్కిలి సంక్షేపింపబడి, స్వల్పపరిమితిలో ముఖ్యమైన లక్షణములను గాయకులు కనబరచుట తటస్థించు చున్నది. షుమారు అరగంట సేపు పాడదగిన కీర్తన పది నిమిషములలో ముగియుచున్నది. ఇట్లనేక సంవత్సరములుగా జరుగుటచే, గాయకులకును, శ్రోతలకును విశ్రాంతి గను, విలంబముగను పాడదగిన కీర్తనలయందును, రాగములయందును వాంఛ తగ్గిపోవుచున్నది. ఇట్టి క్రొత్త యలవాటు చొప్పున గాన సభలలో సహితము, గాయకులు కీర్తనలను, రాగములను, కొద్దిలో ముగించుచున్నారు. పూర్వమొకప్పుడు తమిళ దేశమునకు చెందిన సంగీత విద్వాంసుడు తోడి సీతారామయ్య యను నాతడు తోడి రాగమును ఎనిమిదిరోజులు పాడెడివాడని ప్రతీతి గలదు, ఇపుడన్ననో ఇరువది నిమిషములు పాడుటయే ఘనముగ నెన్న బడుచున్నది. ఇంచుమించు రేడియో సంగీత లక్షణములు గలదియే గ్రామఫోను సంగీతము. ఈ రెండువిధము అయిన సంగీత యంత్రములు మన సంగీతమును సంక్షిప్త మొనర్చినవి.

రేడియోలోని లలిత సంగీతమునకు సరిపోలునదే సినిమా గానము. ప్రకృతమున ప్రజలను మిక్కిలి ఆకర్షించుచున్నది సినీమాగాన మని ప్రత్యేకముగ చెప్పనవసరము లేదు. సినిమాకు ప్రాబల్యము లభించిననాటినుండి నాటకములు క్షీణించినవి. నాటకరంగ ప్రముఖులు పెక్కండ్రు సినీమాలో చేరుటను మనము సామాన్యముగా కాంచు చున్నాము. నాటకములో గానమునకు లభించిన ప్రాధావ్యము సినీమాలో లేనందున సినీమాలో గానభాగము తక్కువయైనది. తెలుగు సినీమాలు విశేష భాగము హిందీ సినీమాలను అనుసరించుట చేతను, ప్లేబ్యాకులు, వాద్య బృందము (Orchestra), నేపథ్యసంగీతము (Back-ground music) మున్నగువాటి తోడ్పాటు అవసర మగుటచేతను సినీమాగానపుమట్లు హిందూస్థానీ సినీమా సంప్రదాయముల ననుసరించి యున్నవి. స్వచ్ఛమైన కర్ణాటక సంగీత