Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/761

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక పాశ్చాత్య చిత్రకళ


నప్పటికిని, ఆ చిత్రకారు లవలంబించిన పద్ధతిమాత్రము మొదట హెల్లనిక్ (Hellanic) గను, రానురాను, సాంకేతికముగను భావనాత్మకముగను పరిణమించినది. ఈ యుగమునకు చెందిన కళాకారుడు గుడి (చర్చి)కి సంబంధించిన కొన్ని నియమములకు లొంగవలసి యుండెను. ఈ నిబంధనలే, నియమములే కళయందు అపు రూపమైన ఒక నూతనత్వ మేర్పడుటకు దారితీసినవి. ఈ కాలమునాటి కళాకారులు అనవసర విషయములను తొలగించి, ప్రధాన విషయము యొక్క లోతుల నరసి, కళను సృజనాత్మకముగను, భావనాత్మకముగను, సృజించుట యందే తమశక్తులను కేంద్రీకరించిరి.

13 వ శతాబ్దమునుండి దాదాపు 500 సంవత్సరములు కాలము ఒక గొప్ప ప్రవాహమువలె ఐరోపా చిత్రకళా వాస్తవికత, శాస్త్రీయ పద్ధతుల (Scientific realism) వైపు పరుగెత్తెను. ఈ 5 వందల సంవత్సరములలో, గియాటో (Giotto) మొదలు టర్నర్ (Turner) వరకు గల మధ్యకాలముననున్న టిటియన్ (Tition), ఫైటర్ (Pieter), పెద్ద బ్రూఫెల్ (Brughel the Elder), రెం బ్రాంట్స్ (Rembrants), కారట్ (Corot), రేనాల్డ్సు (Reynolds), కాన్ స్టబుల్ (Constable) మున్నగు ప్రసిద్ధ కళాకారులందరు అనేక ఉపనదులవలె వచ్చి ఈప్రధాన చిత్ర కళా ప్రవాహమునకు సంపూర్ణత్వమును చేకూర్చిరి. ఈ 13వ శతాబ్దము తరువాత చిత్రము కేవలము ద్వైమానమునే (Two dimensional) చూపునదిగా నుండు పద్ధతి యంతరించినది. ఇప్పుడు చిత్రపటము (Painting) వస్తువు యొక్క కేవలపరిమాణ పరిమితిని (object in space)ఆకార వర్ణనలనే కాక ఆయతనము (volume) ను తెలుపునదిగా కూడ బయలు వెడలినది, 13వ శతాబ్దమునందలి సుప్రసిద్ధ చిత్రకారుడగు గియట్టో (Giotto) వలెనే 15 వ శతాబ్దము నందలి లియోనార్డ్స్ డావిన్సీ (Leonards davinci) అను కళాకారుడు, చిత్రకారుని దృష్టిని శాస్త్రకారుని దృష్టిపథముతో మేళవించెను. ఈ అధ్యాయమునందు స్మరింప బడిన చిత్ర కారులందరిలో టర్నర్ (Turner), కాన్స్టబుల్ (Constable) అనువారలిద్దరు విశేషముగా స్మరణీయులు. వారి చిత్రకళారీతుల ప్రభావమునకు లోనైనవారు ఫ్రాన్సు దేశీయులు. వారి ప్రభావమే ఫ్రాన్సు దేశీయ చిత్రకారుల ఛాయావాదము (impressionism) నకు పునాది యని చెప్పవచ్చును.

19వ శతాబ్ది అంత్యదినములలో కళాకారుడు శాస్త్రీయ జాగృతిని గుర్తించి, తత్ప్రభావ ఆవేశములకు వశ్యుడుకాక ఉండలేకపోయెను. రెండవమారు ఐరోపా దేశీయ చిత్రకళా చరిత్రలో శాస్త్రీయ పద్ధతుల విజృంభణము, జయోత్సాహములు, కళాకారుని సమస్యలను తీర్చుటకు బాసటయై నిలిచెను. నిజమైన వాస్తవికతను సృజింపవలయు నన్నచో పరిశోధనాగారపు పద్ధతులను (Laboratory methods) వినియోగించవలసిన యవసర మేర్పడెను. ఘనపదార్థములను (Solid bodies) వెలుతురు మూలమున చూపవచ్చునన్న సత్యమును గ్రహించి ఛాయావాదులు నవీనమైన శాస్త్రీయ సిద్ధాంతముల సాహాయ్యమున, వర్ణదృష్టి సంబంధ విషయమును (optic & colour) గ్రహించినారు. వారు వర్ణమును విచ్ఛిన్నకిరణాంతర్గత రేఖలు గను, అపసర్పణరశ్మి వర్ణములుగను (tunes of spectrum) విభజించి, పాలెట్ (pallet) నుండి భూమిరంగులను బహిష్కరించిరి. ఛాయా వాదుల కాలము వరకు చిత్రకారుడు విశ్రాంతిగ చిత్రశాల (Studio) యందు చిత్రమును చిత్రించుచుండెడువాడు. ఆతనికి చిత్రింపబోవు చిత్రము యొక్క ఆకారమ యొక్క పొందికయే ప్రధాన విషయముగ నుండెను. అంగియైన ఆకారమునకు (Form) వర్ణమును అంగముగ గ్రహించి, దాని ఆకారపు పొందికయందే తన సర్వశక్తులను వినియోగించెడివాడు. తరువాత మోనోక్రోము (mono chrome) ను భూమికగ (underpaint) గ్రహించి దానిమీద వర్ణములను వేయుట చిత్రకారుల సంప్రదాయ సిద్ధమైన పద్ధతిగా నుండెను. ఈ విధమైన పద్ధతియందు చిత్రకారుడు తన పనిని రెండు భాగములుగా విభజింపవలసియుండెను. మొదట తన శక్తిని చిత్రము యొక్క పొందిక యందును ఆయా స్థితుల యొక్క రాగముల మేలు కలయిక (disposition of tones) యందును శ్రద్ధవహింపవలసియుండెను. ఈ కూర్పు తనకు తృప్తికలిగించిన తరువాత అతడు తగిన వర్ణములను చిత్రించుటకు పూనుకొనువాడు, ఛాయావాదమునకు పూర్వము వెలసిన ప్రసిద్ధ చిత్రకళా ఖండములన్నియు