Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిలాబాదుజిల్లా


1874-75 సంవత్సరములలో పరిశోధనాత్మక ఖననము కొంత జరిగినను, తరువాత కృషి లేకపోవుటచే సరియైన ఫలితము కలుగలేదు. శాస్త్రి గ్రామమున 3 బొగ్గుగను లున్నవి. ఇచట గంధకముకూడ లభించును.

జనాభా  : ఈ జిల్లా మొత్తం జనాభా 1951 సంవత్సరపు లెక్కల ననుసరించి 9,02,522. ఇందు పురుషులు 4,51,882; స్త్రీలు 4,50,640 ; వీరిలో 7,89,417 మంది గ్రామప్రాంతములందును, 1,13,105 మంది నగర ప్రాంతము లందును నివసించుచున్నారు.

కొండజాతులు  : ఇచట ముఖ్యమైన కొండజాతి ప్రజలు గోండులు. జిల్లామధ్యలో పర్వతాలలోను అడవులలోను నిండియున్న ఉట్నూరు, ఆసిఫాబాదు, రాజూరా తాలూకాలయందు ఈ గోండులు అధిక సంఖ్యాకులుగా నున్నారు. ఈ జిల్లాలో వీరిసంఖ్య 1951 వ జనాభా లెక్కల ప్రకారము 90,591.

వృత్తులు  : ఈ జిల్లాలో ముఖ్యవృత్తి వ్యవసాయము.ఈ వృత్తిచే 6,40,150 మంది జీవించుచున్నారు. ఇందు 3,06,059 మంది సొంతభూములను సేద్యముచేసి కొందురు. 1,25,842 మంది యితరుల పొలములను కౌలుకు వ్యవసాయము చేయుదురు. 1,98,336 గురు వ్యవసాయకూలీలు. 9,913 మంది తమ భూములను కౌలుకు ఇచ్చి ఆ ఆదాయముతో జీవించెదరు.

వ్యవసాయేతర వృత్తులైన వ్యాపారము, రవాణా ఉద్యోగాలుకూడ ప్రజలకు జీవనాధారములుగా ఉన్నవి. వీనిలో వ్యాపారము చేసెడివారు. 24,195 మందియు, రవాణావృత్తులలో నున్న వారు 11,766 మందియు, ఉద్యోగములలో 93,275 మందియు కలరు.

విద్య : ఆదిలాబాదు జిల్లాను విద్యలో వెనుకబడిన దానినిగానే చెప్పవలెను. ఇచ్చట మొత్తము జనాభాలో విద్యావంతులు దాదాపు నూటికి 5 గురు మాత్రమే. ఈ జిల్లాలోని 9,02,522 మందిలో అక్షరాస్యుల సంఖ్య 51,162 మాత్రమే. ఈ జిల్లాలో 399 పాఠశాలలున్నవి. ఇందులో 8 మాధ్యమిక పాఠశాలలు, 3 ఉన్నత పాఠశాలలు, మిగతవి ప్రాథమిక పాఠశాలలు కలవు. ప్రాథమిక విద్య నభ్యసించెడి మొత్తము బాలబాలికల సంఖ్య 22,654.

వైద్యము  : ఈ జిల్లాలో మొత్తము పదునాలుగు వైద్యశాలలు కలవు. వీనిలో ఒకటి జిల్లా వైద్యశాల, అది పెద్దది. శేషించిన వాటిలో ఒకటి ప్రాజెక్టులకు సంబంధించినది. ఒకటి జైలుకు సంబంధించినది. శేషించి నవి అందరకు ఉపయోగించునవి. ఈ వైద్యశాలలలో మొత్తం 24 మంది వైద్యులు పనిచేయుచున్నారు. ఇవి కాక యూనాని వైద్యపద్ధతి ప్రకారము పనిచేయు వైద్యశాలలు మూడు, ఆయుర్వేద చికిత్సా పద్ధతి ననుసరించెడి వైద్యశాలలు మూడు కలవు. వీనిలో 7 గురు వైద్యులు పనిచేయుచున్నారు.

పంటలు :ఈ జిల్లాలో ఆహారమునకు పనికివచ్చు పంటలందు జొన్నపంట ముఖ్యమైనది. జిల్లా మొత్తము విస్తీర్ణములో 5,43,732 ఎకరములలో జొన్న సాగు చేయబడుచున్నది. దీని తరువాత పేర్కొనదగినది వరి పంట. 70,604 ఎకరములలో వరి సేద్యము జరుగు చున్నది. సజ్జ, గోధుమ, మొక్కజొన్న కూడ పండించుట కలదు. సెనగ, కంది, పెసర ధాన్యములు కూడ ఈ జిల్లా వ్యవసాయోత్పత్తులలో నున్నవి.

వ్యాపారపు పంటలలో ముఖ్యమైనది ప్రత్తి. ఈ జిల్లాలో మొత్తము 2,69,958 ఎకరములలో ప్రత్తి పండించుట కలదు. 34,119 బేళ్ల ప్రత్తి ఉత్పత్తి యగుచున్నది. ఇదిగాక 17,767 ఎకరములందు వేరు సెనగ; 15,479 ఎకరములలో ఆముదాలు పండు చున్నవి. ఆవాలు, నువ్వులు, చెరకు, పొగాకు ఇచట అప్రధానమైన వ్యాపారపు పంటలు.

గృహపరిశ్రమలు  : ఈ జిల్లాలో ప్రత్యేకముగా పేర్కొనదగిన చేతిపరిశ్రమలు లేవు. ఇచట సాలెవారు ముతక ధోవతులు, చీరలు స్థానికుల ఉపయోగార్థము తయారుచేయుదురు. ఇచట మొత్తము మగ్గముల సంఖ్య 3,257. రంగి రేజులు వస్త్రములకు అద్దకముపని చేయుదురు. వ్యవసాయ పరికరములను స్థానికులైన కమ్మరులు చేయుదురు. సిర్పూరులో చర్మముతో నీటితీత్తులు తయారు చేయుదురు. కొయ్యతోను, కఱ్ఱ చూర్ణముతోను వివిధ వర్ణములలో తయారుచేసెడి ఆటవస్తువులకు నిర్మల చాల ప్రసిద్ధివహించినది. నిర్మలలో ఇనుపకత్తుల పరిశ్రమ కూడ కలదు.