Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రోద్యమము (తెలంగాణములో)


( ఇప్పుడు పద్మభూషణ) మాడపాటి హనుమంతరావు పంతులుగారు కార్యదర్సిగను ఎన్నుకొనబడిరి.

ఆంధ్రజన సంఘముయొక్క ఆదర్శములు :-

1. ఈ సంఘమునకు నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘమని పేరు.
2. నిజాం రాష్ట్రమునందలి ఆంధ్రులయందు పరస్పర సానుభూతిని కలిగించి, వారి అభివృద్ధికై ప్రయత్నించుట

ఈ సంఘము యొక్క ఉద్దేశము.

3. ఈ రాజ్యములోని ఆంధ్రులకొరకు సంఘములను సంస్థలను స్థాపించుట, ఉన్న వానికి సహాయము చేయుట, ఉపన్యాస సభలను సమావేశపరచుట మున్నగు కార్యముల వలన పై ఉద్దేశములు నెరవేర్చబడును.
4. ఈ రాజ్యములోని ప్రతి ఆంధ్రవ్యక్తియు, పదునెనిమిది వత్సరముల కన్న మించిన వయస్సు కలిగి, చదువను, వ్రాయను నేర్చినచో ఈ సంఘమున సఖాసదుడు కావచ్చును.

ఈ ఆంధ్రజన కేంద్ర సంఘము స్థాపితమైన సంవత్సరమునకు అనగా 1923వ సంవత్సరమున ఒక ఉపనియమావళి సిద్ధము చేయబడి అందులో జిల్లాలలోను, కేంద్రము నందును ఆంధ్రజనసంఘము నెరవేర్చవలసిన విధులు ఈ విధముగా నిర్ణయింపబడినవి :

(అ) గ్రంథాలయములను స్థాపించుట, పఠన మందిరములను పాఠశాలలను స్థాపించుట.
(ఆ) విద్యార్థులకు సహాయము చేసి ప్రోత్సహించుట,
(ఇ) విద్వాంసులను గౌరవించుట.
(ఈ) తాళ పత్ర గ్రంథములను, శాసనముల ప్రతులను సంపాదించుట, పరిశోధించుట,
(ఉ) కరపత్రముల మూలమునను, లఘుపుస్తకముల మూలమునను విజ్ఞానము వ్యాపింప జేయుట.
(ఊ) ఆంధ్ర భాషా ప్రచారమునకై వలయు ప్రయత్నములు జరువుట.
(ఋ) వ్యాయామములను, కళలను ప్రోత్సాహ పరచుట.
(ౠ) అనాథులగువారికి అత్యవసరమగు సహాయము చేయుట.

ఈ ఆదర్శములను, సాధనములను గమనించినపుడు ఈ సంస్థ నిజాంరాష్ట్రవాసులైన స్త్రీ పురుషులకు మాత్రమే పరిమితమైనటుల స్పష్టమగుచున్నది. తరువాత నగర ఆంధ్రజనసంఘ కార్యకర్తల పర్యటన, ప్రచార, ప్రబోధ ఫలితముగ జిల్లాలలో ఆంధ్రజనసంమములు స్థాపితమైనవి. ఈవిధముగ స్థాపితమైన (1) హైదరాబాదు, 2) సికింద్రాబాదు, (3) వరంగల్లు, (4) ఖమ్మము, (5) హుజూరాబాదు ప్రతినిధులు హనుమకొండలో 1-4-1923 నాడు సమావేశమై ఆంధ్రజన కేంద్రసంఘ నియమావళి నంగీకరించిరి. ఈ విధముగ ఏర్పడిన కేంద్ర సంఘము యొక్క మొదటి సమావేశము. 27-07-1923 నాడు హైదరాబాదులో జరిగి ఆంధ్రజన కేంద్ర సంఘములు చేయవలసిన కార్యములను నిర్ణయించినది. ఈ కార్యములను పరిశీలించినపుడు ఆంధ్రజన సంఘముల కార్యక్షేత్రము విద్యా, వైజ్ఞానిక, వర్తక, వ్యాయామాది సమస్యలకుమాత్రమే పరిమితమైయుండి రాజకీయాలకు దూరముగా నుండినట్లు స్పష్టము కాగలదు. తరువాత కేంద్ర సంఘ సమావేశాలు నల్లగొండ, మధిర, సూర్యా పేట, జోగి పేట, దేవరకొండ, ఖమ్మము, సిరిసిళ్ళ అనుచోట్ల మొత్తము ఎనిమిది సమావేశాలు జరిగినవి. ఈ కాలమున ఆంధ్రజన కేంద్ర సంఘము యొక్క కార్యక్రమమును పరిశీలించినపుడు విద్యార్థులను ప్రోత్సహించుట, గ్రంథాలయములను స్థాపించుట, గ్రంథాలయ సభలనుచేయుట, వర్తకసంఘములను స్థాపించుట, వర్తక సమస్యలను గూర్చిన లఘుపుస్తకములను ప్రకటించుట, వెట్టిచాకిరి మొదలగు సామాజిక సమస్యలను గూర్చి ప్రబోధము కావించి తీర్మానాలు చేయుట, పాఠశాలల స్థాపనను గూర్చిన సమస్యలను చర్చించుట, ప్రచార కార్యక్రమమును నిర్వహించుట' ప్రధానములుగ గన్పట్టుచున్నవి. మధిరలోను, సూర్యా పేటలోను ఈ కేంద్ర సంఘ సమావేశాలతో పాటు రెండు.గ్రంథాలయ సభలుకూడ జరిగినవి. తాళపత్ర గ్రంథ సేకరణమునుగూర్చి ఈ సంఘము ప్రత్యేక శ్రద్ధను వహించి ఒక ఆంధ్ర పరిశోధక సంఘమునుకూడ స్థాపించినది. ఇదియే ఇప్పటి “లక్ష్మణరాయ పరిశోధక మండలి.” ఈ మండలివారు, విశేషించి మండలి యొక్క కార్యదర్శి శ్రీ ఆదిరాజు వీరభద్రరావుగారు తెలంగాణమందలి