Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రవిష్ణువు

రాష్ట్రావతరణము దేశమంతటితోపాటు విశ్వకళాపరిషత్తునకు అత్యంత శుభోధర్కము లైనవి. సంస్కృత శాఖను నెలకొల్పుటకు సుప్రసిద్ధులగు శ్రీ కున్హం రాజాగారిని నియమించిరి. అన్నిటికంటెను ప్రత్యేకమైన విషయము పరమాణు శాస్త్ర పరిశోధననిలయ స్థాపనప్రయత్నము. సుప్రసిద్ధ శాస్త్రవేత్త యగు శ్రీ స్వామి జ్ఞానానందుల వారిపై ఈ భారము నుంచిరి. శ్రీ రామలింగా రెడ్డిగారి అనంతరము విశ్వవిద్యాలయములో చిరకాలమునుండి పని చేసి సకలానుభవములను పొంది ఎల్లరిమన్ననలకు పాత్రులైన డాక్టర్ వి.యస్, కృష్ణాగారు ఉపాధ్యక్షులైరి. అట్లే అత్యంత ప్రజ్ఞావంతులు అనుభవజ్ఞులు అగు డాక్టర్ రంగ ధామరావుగారు కళాశాలాధ్యక్షులైరి. వీరిరువురి కృషి వలనను తిరుపతి విశ్వ విద్యాలయము రూపొందినది. ఈనాడు (1955 డిశంబరు నాటికి) ఆంధ్ర విశ్వవిద్యాలయమునందు 8 వృత్తి కళాశాలలు, 18 డిగ్రీ కళాశాలలు, 7 ఇంటర్మీడియేట్ కళాశాలలు, 10 పాచ్య విద్యా కళాశాలలు గలవు. ప్రాచ్యవిద్యా కళాశాలలలో గాక మిగిలిన కళాశాలలలో మొత్తము 21,500 విద్యార్థులున్నారు. అందు 1200 స్త్రీలు.

సర్, సి. వి. రామ౯ గారు భౌతికశాస్త్రమందు ఆనరరీ ప్రొఫెసరుగా నుండి ఆంధ్రుల యెడ తమకు గల అభిమాన మును చాటియున్నారు. డాక్టరు లక్కరాజు సుబ్బారావు గారు సెనేటు సభ్యులుగాను, ఆనరరీ లీగల్ అడ్వయిజరు గాను విశ్వవిద్యాలయ నిర్వహణమున గణనీయమగు కృషి సలిపిరి. డాక్టరు లక్కరాజు సుబ్బారావుగారు, డాక్టరు టి. యస్. తిరుమూర్తిగారు, శ్రీ ఓబుళంపల్లి పుల్లారెడ్డిగారు, తాత్కాలికోపాధ్యాయులుగా నుండి విశ్వవిద్యాలయ ప్రతిభకు దోహదము కలిగించినారు.

ఉపసంహారము  : ఏబది సంవత్సరముల పూర్వము నుండి ఆంధ్రులు కాంచిన కలలు వారి కృషి ఫలితముగ 1926 నాటికి ఫలసిద్ధిగాంచినవి. 1951 నాటికి 25 ఏండ్లు నిండగనే విశ్వవిద్యాలయము 52 డిసెంబరులో అమితోత్సాహముతో రజతోత్సవ మొనరించుకొనినది. విశ్వ విద్యాలయ చరిత్రలో 25 ఏండ్ల కాలము చాల తక్కువైనను ఎన్ని యో అడ్డంకులను, ధనాభావమును, నిరుత్సాహకరములగు పరిస్థితులను ఎదుర్కొని నేటికి విశ్వవిద్యాలయము బహుముఖ వ్యాప్తినొంది, అమితమగు కీర్తిని సంపాదించి, ఆంధ్రజాతికి గర్వకారణమై, భారతదేశమునందు తన ధర్మమును శక్తితో, ప్రాభవముతో, గౌరవముతో నిర్వహించుచున్నది.

పి. యల్. యన్. శర్మ.

ఆంధ్రవిష్ణువు  :- బ్రహ్మాండాది పురాణములందు కీర్తింపబడి, సత్కవుల మన్ననలందుకొని, శ్రీకాకుళాధి నాథుడై, ఆంధ్రుల ఆరాధ్యదైవమై, ఆంధ్రభోజునికి ఆముక్తమాల్యద కావ్యరచనకు ప్రోత్సాహమొసగి, కాసుల పురుషోత్తమకవి నిందాస్తుతులకు పాల్పడిన ఆంధ్రవీరుడే ఆంధ్రవిష్ణువు. ఇతడే ప్రప్రథమమున ఆంధ్ర సామ్రాజ్యమును స్థాపించిన మహనీయుడు. పరాక్రమ సంపన్నుడు. ఆంధ్రులచరిత్రలో స్వర్ణాక్షరములతో లిఖింపదగిన దీయాంధ్రరాజ్య స్థాపనో దంతము. ఆంధ్రవిష్ణువు చరిత్రకు దీనికి అవినాభావసంబంధము కలదు.

సాధారణముగ శాతవాహన సామ్రాజ్యము మొదటి ఆంధ్ర సామ్రాజ్యమని, చరిత్రకారులు పేర్కొనుచున్నారు. పురాణము లందు ఈ రాజుల చరిత్ర వర్ణింపబడియున్నది. ఐనను వీరికిముందే ఆంధ్రసామ్రాజ్య సంస్థాపనము జరిగినదని వీరంగీకరించుచునే యున్నారు. చంద్రగుప్తునకు పూర్వమే ఆంధ్రులు సామ్రాజ్యమును నిర్మించుకొని రనియు, వా రధిక బలాఢ్యులై చతురంగ బలసముపేతులై శత్రుదుర్భేద్యములగు ముప్పది దుర్గముల కధిపతులై యుండిరనియు మెగస్తనీసు వ్రాతలవలన స్పష్టమగుచున్నది. క్రీ. శ. 4వ శతాబ్దికిముందే ఆంధ్రసామ్రాజ్యముండినదని వేరుగా చెప్పనవసరములేదు. ఒక్క ఆంధ్ర విష్ణువుతప్ప తదితరులనుగూర్చి విశేషాంశములు లభ్యములు కాకపోగా చారిత్రికాంశములతో సమన్వయపరచ నగు సంఘటనలు సైతము దొరకనప్పుడు, అటులూహించుటలో నాశ్చర్య మేమియు లేదు. ఇవి ఇటులున్నను కావ్యములందును, తదితర గ్రంథము లందును గల యితి వృత్తములం దచ్చటచ్చట ఆంధ్రవిష్ణువునకు, రాజ్యస్థాపనో దంతమునకు, ఆంధ్రులకు సంబంధించిన విషయము లుదాహరింపబడిన వాటిని గ్రహించి ప్రథమచారిత్రిక సంఘటనను గూర్చి వివరించుటకు చరిత్రకారులు ప్రయత్నించుచునే యున్నారు. ప్రథమాంధ్ర రాజ్యస్థాపన దంతమును గూర్చి