Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II


రింప యత్నించెను. కాని అందుసంపూర్ణముగా కృతార్థుడు కాజాలకపోయెను.

కామేశ్వరకవి ధేనుకా మాహాత్మ్యము, ఆచార్య విజయము అను రెండు వచన కావ్యములనుకూడ రచించెను. ఇందు మొదటి గ్రంథ మొక్కటే కనబడు చున్నది. "ధీరులు పాక వైరి లోక వికచ కల్పక స్తబక గంధ ధురంధర సూక్తియుక్తి నౌనవునని మెచ్చ నావుల మహ త్త్వమొనర్చితి" నని అతడే చెప్పుకొనియున్నాడు.

ముద్దళ గిరి కృతినందిన మూడవకృతి విద్యావతీ దండకము. దీనిని రచించినవాడు గణపవరపు వేంకట కవి (క్రీ. శ. 17 వ శతాబ్ది మధ్యభాగము). ఇతడు బహు గ్రంథకర్త. అపారమైన పాండిత్యము, అద్వితీయమైన శాస్త్రవిజ్ఞానము, అనంతమైన లోకానుభవముకల్గి ఈతడు కర్ణాట తుండిర చోళ పాండ్య మండల ప్రముఖాఖిల మండలా ఖండులచే సత్కారము లందియుండెను. ఇతడు వ్రాసిన గ్రంథములలో లక్షణ గ్రంథము లెక్కువ. బాల రామాయణ ద్విపద, జాంబవతీ విలాస చిత్రకావ్యము, పరమభాగవత చరిత్ర, పురాణసారము, కృష్ణమల్ల కథ అను పేర్లుగల ఈతని కావ్యము లిప్పుడు లభించుట లేదు. లభ్యమగుచున్న వానిలో ప్రబంధరాజ వేంక టేశ్వర విజయ విలాసము మహత్తరమైనది. ఇదియు " అమూల్యమైన లక్షణ గ్రంథమే కాని తన్మూలమున నతని కవితా శక్తి కొంతవరకు కనుగొననగు" నని శ్రీ డా. నేలటూరి వేంకటరమణయ్య గారు తెల్పుచున్నారు. గర్భచిత్ర కవిత్వ రచనయందును, పదముల కూర్పునందును ఇతడు ప్రదర్శించిన నేర్పు అపూర్వమైనది. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసమునందలి 808 వ సీసపద్యమున అరువదికి పైగా వృత్తాదులు గర్భితములై యున్నవనియు, అట్టి పద్యమును తెలుగు కబ్బములలో నెవ్వరును రచించి యుండలేదనియు కీ. శే. పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రశంసించియున్నారు. లింగానుశాసనము, తెనుగు ప్రతాప రుద్రీయము, రసమంజరి, వేంకటేశాంధ్ర మనబడు అభిననాంధ్ర నిఘంటువు, ఆంధ్రకౌముది, గణయతి ప్రాస సీసమాలిక, రేఫ ఱకార నిర్ణయ పద్ధతి, షత్ప్రత్యయ ప్రస్తారసరణి, అలంకార సారము, ఆంధ్ర ప్రయోగ రత్నాకరము, ఇర్వదారు ఛందముల వచనము, ఆంధ్ర ద్విరూప కోశము, ఆంధ్రప్రక్రియా కౌముది, అనునవి ఇతడు రచించిన లక్షణ గ్రంథములు, సర్వలక్షణ శిరొమణి అను గొప్ప లక్షణ గ్రంథమును కూడ ఇతడు రచించినట్లు తెలియుచున్నది. ఇది పది ఉల్లాసములకు తక్కువ కాని వివిధ లక్షణ లక్షితమైన అమూల్య లక్షణ కావ్యము. నిజమునకు దీనిని లక్షణ రత్నాకర మని చెప్పనగును. పైన పేర్కొనబడిన లక్షణ గ్రంథములలో పెక్కులు ఇందలి ఉల్లాసములే. వేంకటేశాంధ్ర మందలి ద్వితీయోల్లాసము, ఆంధ్ర కౌముది తృతీయోల్లాసము, ఆంధ్ర ద్విరూప కోశము దశ మోల్లాసము. ఈ మహాకవి కవితా విశేషముల నెరుగుటకు ఈ గ్రంథమంతగా ఉపయోగపడక పోయినను అతని పొండితీ పాటవమున కిది భాండా గారమని చెప్పుటకు సందేహింప నక్కరలేదు. ఈ గ్రంథము సమగ్రముగా లభింపకపోవుట విచారకరము. ఇది వేంకటేశ్వరున కంకితము.

విజయరంగ చొక్కనాథుడు కవిపండిత పోషణ మొనరించుటయేకాక తాను స్వయముగా మాఘ మాహాత్మ్యము, శ్రీరంగ మాహాత్మ్యము అను వచన గ్రంథములను రచించెను' ఇతని సంస్థానమునందలి కవులలో మొదట పేర్కొనదగినవాడు సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు. ఇతడు అహల్యా సంక్రందనము, రాధికా సాంత్వనము అను పద్య కావ్యములను, జైమినీ భారత మను వచన కావ్యమును రచించెను. రాధికా సాంత్వనము ఏకాశ్వాస ప్రబంధము. ఇందు అసభ్యములైన శృంగార పద్యము లెన్ని యో కలవు. ఇందలి పద్యములన్నియు ముద్దుపళని రాధికా సాంత్వనమునందు కూడ నున్నవట. ఆమె వానికి మరికొన్ని పద్యములు చేర్చి నాలుగా శ్వాసములుగా విభజించి యున్నదట. ఇదే సత్యమైనచో ముద్దుపళని వేంకటకృష్ణ నాయకుని పద్యములను హరించినదని చెప్పవలసి వచ్చును. ఈ పద్యము లెవరు రచించినవైనను ఇందలి కవిత్వము మృదుమధురమై తేట తెలుగు తియ్యదనమున కాల వాలములై యలరారుచున్న వనుటకు సందేహింప నక్కర లేదు. నీతి బాహ్యములైన కొన్ని శృంగార పద్యములను వర్ణనలను తొలగించినచో ఇట్టి సుకుమార కావ్యము మరొక్కటి లేదని చెప్పవచ్చును.