ఆంధ్ర వాజ్మయ చరిత్రము - II
నందలి కధకు మూలములైన గ్రంథములలో ఇదియు నొక్కటి. ఇందు వీరరసము మిక్కిలి నిపుణముగా వర్ణింపబడినది.
హరిభట్టు అను కవి (క్రీ.శ. 1530) వరాహపురాణము మత్స్యపు రాణము, భాగవతమునందలి షష్ఠి కాదశ ద్వాదశ స్కంధములు, నరసింహ పురాణము అను గ్రంథములను రచించెను. ఇందు మత్స్య నరసింహపురాణములు మాత్రమే ముద్రితములైనవి. ఇందు వరాహ నరసింహ పురాణములుతప్ప మిగిలినవన్నియు భగవదంకితములు చేయబడినవి. వరాహపురాణము నిజాము రాష్ట్రము నందలి ఖమ్మం మెట్టు గ్రామమునకు కరణమైన కొలిపాక ఎఱ్ఱయామాత్యున కంకితము కావింపబడెను. హరిభట్టు మత్స్యపురాణమును పూర్తిగా అనువదించి యుండ లేదు. అందలి విష్ణుధర్మోత్తర ఖండమును మాత్ర మైదాశ్వాసములలో రచించెను. ఇందు విష్ణుపూజాఫలము, తులసీ మాహాత్మ్యము మొదలగు భక్తి ప్రధానములగు కథలు వర్ణింపబడినవి. ఈగ్రంథము శ్రీరంగేశునికి అంకితము చేయబడినది. ఎఱ్ఱాప్రెగడ నరసింహ పురాణమునందలి పూర్వభాగమును మాత్రము రచించియుండుటచే, హరిభట్టు ఉత్తరభాగమును మాత్రము అనువదించి యుండెను, ఈగ్రంథము వచనకావ్యమని పేర్కొనబడినది. నిజమునకిది పద్యగద్యాత్మకమైన చంపూకావ్యమే కాని వచన కావ్యముకాదు. హరిభట్టు రచన సమ సంస్కృతాంధ్ర పద భూయిష్ఠమై మిక్కిలి మధురముగా నుండును.
తెలుగునందలి మొదటి అచ్చతెలుగుకా కావ్యము యయాతి చరిత్ర. దీనిని రచించినవాడు పొన్నికంటి తెలగన్న (క్రీ. శ. 16 వ శతాబ్ది ఉత్తరభాగము). ఇతడికావ్యమును ఇబ్రహీం కుతుబ్షాకు సామంతుడైన అమీను ఖాను అను మహమ్మదీయ సరదారున కంకితము చేసెను. ఇట్లు మహమ్మదీయ ప్రభువున కంకితము చేయబడిన మొదటి గ్రంథ మిదియే. ఇందలి కథ భారత భాగవతములనుండి గ్రహింపబడినది. తెలగన్న యయాతి చరిత్రము నందలి శృంగార భాగములకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చెను. అచ్చ తెలుగను పేరున్నను ఇందు తద్భవములైన పదములును కృత్రిమములై న సమానములును పెక్కు కానిపించును.
తెలుగున అచ్చతెలుగు కవిత్వము అను ప్రత్యేక సంప్రదాయమునకు దారిచూపి దానిని సాధ్యమైనంతవరకు రసోత్తరముగా వెలయించిన తెలగన్న ఎంతయు ప్రశంసనీయుడు. ఇతని ప్రకృతివర్ణనలు రమణీయములును ఉదాత్త భావపూరితములునై మనోహరములుగా నుండును.
అద్దంకి గంగాధరకవి తపతీసంవరణోపాఖ్యానమను శృంగారప్రబంధమును రచించి గోలకొండ నవాబైన ఇబ్రహీం కుతుబ్ షా కంకితము చేసెను. ఇందలి కథ భారతమునుండి గ్రహింపబడినది. ఈప్రబంధము నవరస బంధురములైన కల్పనలతోకూడి వసుచరిత్రను తలపించు చుండును.
వైజయంతీ విలాస మనుపేర విప్రనారాయణ చరిత్ర మను ప్రబంధమును రచించిన సొరంగు తమ్మయ మహమ్మదు కుతుబ్షాకాలములో గోలకొండకు కరణముగా నుండెను. ఇతడు వైష్ణవమతాభిమాని, తన కావ్యమును శ్రీరామునికి అంకితము చేసెను. ఈ ప్రబంధము అత్యంత శృంగారమయమై అచ్చటచ్చట సభ్యతామర్యాదనుకూడ అతిక్రమించున ట్లుండును. ఐనను ఇందలికథ రమ్యము. భావములు గంభీరములు. రచన మధురము. వేశ్యాలోలత్వమువలని కీళ్లు ఇందు చక్కగా ప్రదర్శింపబడినవి.
మల్లా రెడ్డి అను కవి క్రీ. శ. 16వ శక్తాబ్ది అంతమున మెదకు సమీపమునందలి బిక్కనవోలు రాజధానిగా రాజ్యము చేసిన రెడ్డిరాజులవంశమునకు చెందినవాడు. ఇతడు షట్చక్రవర్తి చరిత్రము, శివధర్మోత్తరము, పద్మ పురాణము అను గ్రంథములను రచించెను. షట్చక్రవర్తి చరిత్రమున హరిశ్చంద్రాదు లగు ఆర్గురు చక్రవర్తుల కథలు వర్ణింపబడినవి. ఇందు ప్రబంధ సామాన్యములగు వర్ణన అన్నియు గోచరించును. ఇందలి రచన శ్లేషశబ్దాలంకారములతోకూడి వసుచరిత్ర రచనను తలపించు చుండును. శివధర్మోత్తరము శివపారమ్యమును బోధించు గ్రంథము. ఇందు శైవమతధర్మము, వేదాం తము, శైవాచారములు వర్ణితములై యున్నవి. మల్లారెడ్డి శ్లేషాదులకై అంతగా యత్నింపనికతమున అతని పద్మ పురాణమునందలి కవిత్వము సులభమును సహజమునై అలరారుచుండును. ఇందలి నాల్గవ ఆశ్వాసమున రామాయణ కథ చెప్పబడినది. వాల్మీకి రామాయణము