Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I


తోడనుగూడి చాల రమణీయముగా ఉండును. ఇందలి కధయు అది వెల్లడి జేయు నీతులును మిక్కిలి ఉదాత్తము లుగా నుండును. ఈ యుగమునందలి ప్రశస్త రచనలలో ఇది ఒకటి.

కొరవి గోపరాజు (క్రీ. శ. 15వ శతాబ్ధి పూర్వార్ధము) సింహాసన ద్వాత్రింశిక అను కథాకావ్యమును రచించెను. భోజరాజు విక్రమార్కుని సింహాసనము నధిరోహింపవచ్చు నప్పు డందలి సాలభంజిక లతనిని వారించుచు చెప్పిన ముప్పది రెండు చక్కనికధ లిందు వర్ణింపబడినవి. ఇందు గోపరా జాయా సందర్భములం దా కాలమునందలి విద్యల స్వభావమును, ఆచారములను ప్రదర్శించి తన సర్వజ్ఞతను సూక్ష్మపరిశీలనమును వ్యక్తము చేసినాడు. ఇందలి శైలి సహజమై కథన మార్గమున నడచుచుండును.

జగత్ప్రసిద్ధమైన సంస్కృత పంచతంత్రమును దూబగుంట నారాయణకవి అనువదించి (1470) మాధవవర్మ వంశీయు డయిన బసవ భూపాలుని కంకితము కావించెను. ఈ కావ్యము ప్రపంచమునందలి ఎల్ల భాషలలోని కనువదింపబడి ఉండుటయే దీని అప్రతిమాన ప్రశ స్తికి తార్కాణము. ఇందు మిత్రభేదము, సుహృల్లాభము, సంధి విగ్రహము, లబ్ధనాశము, అవిమృశ్యకారిత్వము, అను ఐదు భాగము లున్నవి. ఇందలి పాత్రలు చాలవరకు పశు పక్ష్యాదులే. అవి యొనరించు సంభాషణములు నీతి ధర్మములతో నిండారి అద్భుతములుగా నుండును. వీటి మూలమున కవి మానవుల మానసములకు నొప్పికలుగకుండ నీతి ధర్మములేకాక జీవిత రహస్యములను, రాజనీతి విశేషములను బోధించి యున్నాడు. నారాయణకవి శైలి కథాకథనమున కనుగుణమై, సరళమై, ఎడనెడ హాస్యరసముతోకూడి మనోహరముగా నుండును.

ఈ యుగమునకు చెందిన విద్వత్కవులలో పిల్లల మట్టి పినవీరభద్రు డొకడు (1490). ఇతడు పెక్కు గ్రంథములను రచించినను శృంగార శాకుంతల మను శకుంతలా పరిణయము, జైమిని భారతము అను రెండుకావ్యములు మాత్రమే ఉపలభ్యము అగుచున్నవి. ఇందు శృంగార శాకుంతలము, శకుంతలా దుష్యంతుల వివాహమును వర్ణించు శృంగార ప్రబంధము. పినవీరభద్రు డిందు భారతమునందలి కథనేకాక కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలమునందలి కల్లనుకూడ అనుసరించెను. ఆ నాటకము నందలి పెక్కుశ్లొకము లిందు సందర్భానుసారముగా ననుసరింపబడినవి. సంస్కృతము నందలి నాటకము ప్రబంధరూపము నొందుట కిది రెండవ ఉదాహరణము. శ్రీనాథుని శృంగారనైషధమువలె శృంగార శాకుంతలము కూడ తరువాత వెలసిన ప్రబంధరచనకు మార్గదర్శక మయ్యెనని చెప్పవచ్చును. జై మినీ భారతమున భారతము నందిలి అశ్వమేధ పర్వములోని కధయే విపులముగా వర్ణింపబడినది. ఇం దద్భుతములయిన కథలనేకము లున్నవి, అశ్వమేదాశ్వముతో వేగిన భీమార్జునులు దాని నరికట్టినవారి నోడించి, దిగ్విజయము కావించుట యిందలి ప్రధానవృత్తము. ప్రమీలకథ, బభ్రువాహనుని కథ, చంద్ర హాస చరిత్ర, ఉద్దాలక మహర్షి కథ, కుశలవోపాఖ్యానము మున్నగున విందలి కధలలో ప్రసిద్ధములయినవి. పినవీరభద్రుని శైలి ఈ కావ్యమున పరిపక్వత నందినది. దీనిని రచించు సందర్భముననే అతడు 'వాణి నారాణి' అని చెప్పె నందురు. ఈ కావ్యము విజయనగరము పాలించిన సాళువ నరసింహరాయల కంకితము చేయబడినది. ఈతని రచనలో శ్రీనాథుని ఛాయలు పెక్కు చోట్ల గోచరించును.

నంది మల్లయ, ఘంట సింగనలు తెలుగునందలి మొదటి జంటకవులు (క్రీ.శ. 15-వ శతాబ్ది ఉత్తరార్థము) ప్రబోధ చంద్రోదయము, వరాహపురాణము అనునవి వీరి రచనలు. ఇందు ప్రబోధ చంద్రోదయము సంస్కృతమున కృష్ణమిశ్రుడను కవి రచించిన ఆ పేరుగల వేదాంత బోధకమైన నాటకమునకు బ్రబంధరూపమైన అనువాదము. ఇందలి ప్రధానరసము శాంతము, కామ క్రోధ లోభ మోహ వివేకాదులు, శ్రద్ధా విష్ణుభ క్త్యు పనిషదాదులు ఇందలి పాత్రలు. మానవుని అంతరంగముననుండు ఉత్తమ ప్రకృతులకును, దుష్ట ప్రకృతులకును జరుగు నైతిక సంగ్రామ మిందు వర్ణింపబడినది. తామస ప్రకృతుల ఓటమియు, వివేకుని గెలువును, ప్రబోధ చంద్రుని ఉదయమును చివర చక్కగా నిరూపింపబడినవి. క్లిష్టమైన వేదాంత విషయమునుకూడ నీజంటకవు లిందు రమణీయముగా సర్వజన సుబోధముగా వర్ణించుటతో. తమ ప్రతిభమ ప్రదర్శించినారు. ఈ ప్రబంధము నాచి