Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - 1


ఆంధ్రవాఙ్మయమున ఎఱ్ఱన యుగముతో పురాణ పరివర్తనము సన్నగిల్లినది. తరువాతియుగమున కొందరు కవులు సంస్కృత కావ్య నాటకానువాదమునకును, కొందరు స్వతంత్ర కావ్యరచనకును ఆరంభించిరి. ఈ యుగమునకు కర్త అని చెప్పదగినవాడు శ్రీనాథ కవిసార్వభౌముడు. ఆంధ్రమున కవిత్రయము తరువాత వారితో సమానమైన కీర్తిప్రశస్తులను సంపాదించిన వా డీమహా కవియే. దాని కీతని బహుగ్రంథకర్తృత్వమును, అసామాన్య పాండితీ ప్రతిభలును, నిరర్గళ ప్రౌఢ శైలియు కారణములు. ఇతని రచనలలో మరుత్తరాట్చరిత్రము, సప్తశతి, పండితారాధ్య చరిత్రము నష్టములై పోయినవి. శృంగార నైషధము, భీమఖండ కాశీఖండములు, హర విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీర చరిత్రము అనునవి లభించుచున్నవి. శృంగార నైషధము సంస్కృతమునందలి శ్రీహర్షుని నైషధ కావ్య మున కనువాదము. ఔచిత్యము పాటించుచు, అనౌచిత్యము పరిహించుచు నత డీ అనువాదమున చూపిన నేర్పు అనితర సామాన్యమై ఉన్నది. ఈ కావ్య మా మహాకవి ప్రౌఢశైలికిని, పాండిత్య ప్రకర్షకును నికషోవలమని చెప్పతగి యున్నది. ఇందలివస్తువు నలదమయంతుల పరిణయ వృత్తాంతము. భీమఖండమున గోదావరీ మండలమునందలి ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్ర మాహాత్మ్యము వర్ణింపబడినది. దీనికి మూలము స్కాందపురాణము. శ్రీనాథు డిందా క్షేత్రమును తత్పరిసర ప్రదేశములను ఎంతో విశదముగా వర్ణించి తన ఆంధ్రాభిమానమును ప్రకటించినాడు. వ్యాసుడు కాశి విడిచిన వృత్తాంతము, హాలాహల భక్షణము సరసముగా వర్ణింపబడినవి. కాశీ ఖండమున సుప్రసిద్ధ శైవ క్షేత్రమయిన కాశీ క్షేత్ర మహాత్మ్యము వివరింపబడినది. ఇదియు స్కాందపురాణము నుండియే గ్రహింపబడినది. శ్రీనాథుడు పెదకోమటి వేమునితో కాశీయాత్ర కేగి, అందలి తీర్థదేవతాదులను నిశితముగా పరిశీలించియుండుటచే నిందలి వర్ణనలకు కూడ నెంతో సహజత్వ మలవడినది. క్షేత్రమాహాత్మ్య రూపములై పురాణప్రాయములయిన ఈ రెండు గ్రంథములకును శ్రీనాథుడు తన ప్రతిభాపాటవముచే సుందర మయిన కావ్యత్వము నాపాదింపజాలెను. కాశీఖండమున

వింధ్యగర్వాపహరణము, గుణనిధి చరిత్ర, వ్యాసుడు కాశిని బాసిన కథ, సుశీల చరిత్ర సరసముగా వర్ణింపబడినవి. ఇం దీతని శైలి ప్రౌఢతా పరాకాష్ఠను చెందినది. హరవిలాసము, శివుని విలాసములను వర్ణించు కావ్యము. చిరుతొండ నంబికథ, పార్వతీ పరిణయము, దారుకా వనవిహారము, హాలాహల భక్షణము, కీరాతార్జునీయము, ఇందు వర్ణింపబడిన విలాసములు. చిరు తొండనంబికధను శ్రీనాధుడు పాల్కురికి సోమనాథుని బసవపురాణమునుండి గ్రహించి, పెంచి ఎంతో సరసముగా వర్ణించెను. పార్వతీ పరిణయము కాళిదాసుని కుమారసంభవమునందలి 3, 4, 5 సర్గము లందలి భాగములకు సంగ్రహానువాదము. మిగిలిన వాతని స్వతంత్ర రచనలే. శ్రీనాథుని స్వతంత్ర రచనా సామర్థ్యమును, శైలీసౌష్ఠవమును హరవిలాసమునందే హెచ్చుగా కాంచనగును. శివరాత్రి మాహాత్మ్యమున సుకుమారుని కథ కలదు. పల్నాటి వీరచరిత్ర, పల్నాటి వీరుల శౌర్యమును వర్ణించు జాతీయ ద్విపద కావ్యము. బాలచంద్రుని శౌర్య మిందు విశదముగా వర్ణింపబడినది. శ్రీనాథుడు పండిత రంజకమయిన ప్రౌఢరచనయందు వలెనే పామరరంజకమైన దేశీయరచనయందుకూడ మహా నిపుణుడనుట కీ కావ్యము నిదర్శనము. క్రీడాభిరామము గోవింద మంచనశర్మ, టిట్టిభ సెట్టి అను మిత్రుల సంభాషణ రూపమున వెల్వడిన శృంగారవర్ణనలతో కూడిన కావ్యము. ఇందు రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామము ననుసరించి ఆనాటి ఓరుగంటినగరము చక్కగా వర్ణింపబడినది. ఇది వినుకొండ వల్లభరాయ కృతమని అందున్నది కాని ప్రతిపద్యమునందు శ్రీనాథుని ముద్ర స్పష్టముగా కానవచ్చుటచే నతడే దానిని వ్రాసి వల్లభరాయని పేర ప్రకటించియుండునని యూహింపవచ్చును. శ్రీనాథుడు వివిధదేశములను, వివిధ రాజాస్థానములను దర్శించినప్పుడు చెప్పిన చాటువు లెన్నో ఉన్నవి. అవి ఆతని నిశిత పరిశీలనమును, పరిహాస ప్రియత్వమును స్వేచ్ఛావర్తనమును వ్యక్తము చేయుచున్నవి. శ్రీనాథుని శైలి ప్రౌఢ గంభీరమయినది. ఈతని పద్యముల నడక మత్తేభయానమున కెనయై చదివిన కొలది చవులూరించుచుండును. ఈతడు కావించిన బహుప్రయో