Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I


గ్రంథమును గూడ రచించెను. తెలుగు వ్యాకరణమును తెలుగు భాషలో రచించిన మొదటి లక్షణకర్త ఇతడే. ఇతడు దశకుమార చరితముకు తిక్కన కంకితము చేసి యం దాతని వంశమును, పూర్వులకు చక్కగా వర్ణించెను. కవిత చెప్పి ఉభయకవిమిత్రు మెప్పించితి నని ఇతడు సగర్వముగా చెప్పుకొని యుండెను.

మారన, తిక్కన సోమయాజి శిష్యుడు.. అతడు మార్కండేయ పురాణమును తెనిగించి గోన గన్నా రెడ్డి కంకితముచేసెను. ఇతని శైలి ఆడంబర రహితమై సరసముగా నుండును. తెనుగున తరువాత వెలసిన మను చరిత్రము, హరిశ్చంద్రో పాఖ్యానము, కువలయాశ్వ చరిత్రము మున్నగు ప్రబందములందలి కథావస్తు విందుండియే గ్రహింపబడినది.

ఈ యుగమున వెలసిన పండిత కవులలో అథర్వణా చార్యు డొకడు. ఇతడు భారతము నాంధ్రీకరించెనని ప్రతీతి. ఇది యిప్పుడు లభ్యమగుటలేదు. దొరకిన కొలది పద్యములనుబట్టి ఈతని రచన విరాటపర్వమునుండి ఆరంఖించు ననియు, మిక్కిలి ప్రౌఢమైన దనియు తెలియుచున్నది. అధర్వణకారికావళి అను తెలుగు వ్యాకరణము నీతడు సంస్కృత శ్లోకములుగా రచించెను. ఇతడు త్రిలింగ శబ్దానుశాసన మను చిన్న వ్యాకరణమునుగూడ రచించే నందురు.

క్రీ. శ. 1260 ప్రాంతమున బద్దెభూపాలుడు నీతిసార ముక్తావళి అను నీతిపద్యములతో కూడిన గ్రంథమును రచించెను. సుప్రసిద్ధమైన సుమతికతకమును గూడ నీతడే రచించి నట్లిందు చెప్పబడినది. ఇది ఎంతవరకు సత్యమో తెలియదు. ఇతని పద్యములు సరళసుందరములై పండిత పామర హృదయరంజకములుగా నుండును. తెలుగున వెలసిన మొదటి రామాయణము రంగనాథ రామాయణము. దీనిని రంగనాథుడను కవి వ్రాసి బుద్ధారెడ్డి పేర ప్రకటించెననియు, తండ్రి యుపదేశముచే బుద్ధారెడ్డియే రచించె ననియు ఏతత్కర్తృత్వ విషయమున రెండు వాదములున్నవి.ఆశ్వాసాంతము లందు గోనబుద్ధారెడ్డియే (1200 - 1250) తండ్రియైన విఠలక్ష్మానాథుని పేర నీ గ్రంథమును రచించినట్లు స్పష్టముగా చెప్పబడియుండుటచే ఆవాదమునే పలువురు విమర్శకు లంగీకరించు

చున్నారు. ఇది వాల్మీకి రామాయణము ననుసరించి తెలుగున వ్రాయబడిన ద్విపద కావ్యము. ఇందు కవిజన శ్రుతినుండి గ్రహించి చొప్పించిన అనాత్మికములైన గాథలు కొన్ని గలవు. అందు జంబుమాలి, కాలనేమి. సులోచన అనువారి వృత్తాంతములు ముఖ్యములైనవి. ఇవి ఇందలి కథాభాగమున కెంతో మెరుగు చేకూర్చుచు రసవంతములై యున్నవి. రావణ. విభీవణ, కుంభకర్ణాదుల శీలములును, చిత్తవృత్తులుకు ఇందు చక్కగా వర్ణింపబడినవి. ఇందరి వర్ణనములు మిక్కిలి గంభీరములై ఉదాత్తములుగానుండును. ఇందలి శైలి లాక్షణికమును, ప్రసన్నమునై ద్విపదయయ్యు నెచ్చటను విసుకుగొల్పక చాల మనోహరముగా నుండును. ద్విపద కావ్యములలో శైలీపాటవముచేతను, కథా గౌరవముచేతను రంగనాథ రామాయణమున కొక విశిష్టస్థానము చేకూరినది. ఇందలి ఉత్తరకాండమును బుద్ధారెడ్డి ఆనతిచే ఆతని కుమారులైన కాచవిఠలవిభులు రచించి రామాయణమును పూర్తి కావించిరి. వీరి రచన తండ్రి రచనయంత ఉత్తమము కాకపోయినను రసవంతముగానే ఉండును.

తిక్కన తరువాత యుగకర్త అని చెప్పదగిన వాడు ఎఱ్ఱాప్రెగ్గడ. ఈతని యుగమున వెలసిన తొలికావ్యము భాస్కర రామాయణము. ఇదియును భారతమువలె నైకకవికర్తృక మగుట సంభవించినది. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడైన మల్లి కార్జునభట్టు, శిష్యుడైన కుమార రుద్రదేవుడు, మిత్రుడైన అయ్యలార్యుడు దీనికి కర్తలు. వీరిలో వయః పాండిత్య ప్రతిభలచే పెద్దయైన వాడు భాస్కరుడగుటచే కావ్య మాతని పేరనే వెలయింపబడినది. ఈ రామాయణమున తిక్కన తాతయగు భాస్కరుని రచనకూడ నున్నదని కొందరి తలంపు. అతడు వాల్మీకి రామాయణమును చాల సంగ్రహముగా రచించెననియు, దానితో తృప్తినొందక హుళక్కి భాస్కరాదుల చ్చటచ్చట పెంచి ఈ రామాయణమునకు రూపమొసగిరనియు వారివాదము. వారు చెప్పు హేతువులనుబట్టి చూడ ఈ వాదము కొంత యుక్తి యుక్తముగానే కాన వచ్చుచున్నది. మంత్రిఖాస్కరుని రచన సుందరకాండమువరకు గల అన్ని కాండములందు ఎంతో కొంత కలదని వీనివలన తెలియుచున్నది.